ఏదైనా మ్యాచ్లో ఓడిపోయే స్థితిలో ఉంటే ఆందోళనకు గురవుతాం. దీంతో తెలియకుండానే అనవసర తప్పిదాలు చేసేస్తాం. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లపై కోపం ప్రదర్శిస్తాం. కోపం కాస్త కట్టలు తెంచుకుంటే ప్రత్యర్థి ఆటగాడిపై దాడికి దిగుదాం. ఇదంతా వారి ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఓ మార్గం. 


సరిగ్గా ఇలాంటి సంఘటనే టోక్యో ఒలింపిక్స్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ నికా చెవి కొరికాడు. షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బల్లా, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరు జరిగింది. 


బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్‌.. మూడో రౌండ్‌లో డేవిడ్ చెవిని కొరికాడు. వెంటనే అప్రమత్తమైన డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు. మరీ గట్టిగా కొరకకపోవడంతో డేవిడ్‌కి గాయం కాలేదు. కానీ, ఇదంతా రిఫరీ గుర్తించలేదు. టీవీలో రివ్యూలో మాత్రం బయటపడింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. 






 


కాగా, యూనెస్‌ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూనెస్ చేసిన పనికి అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై డేవిడ్ ఏమన్నాడంటే... ‘గేమ్స్‌లో ఇలాంటివి సర్వసాధారణం. యూనెస్ అసహనాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక ఆటగాడిగా అతడ్ని నేను గౌరవిస్తున్నా’ అని సున్నితంగా చెప్పాడు. తనదైన వ్యాఖ్యలతో డేవిడ్ క్రీడా స్ఫూర్తిని చాటాడు. కాబట్టి ఆటగాళ్లు ఓర్పు, సహనంతో ప్రత్యర్థితో పోటీ పడాలనే కాదు ఇలా దాడులతో కాదు. చూడండి... ఇలా దాడి చేయడం వల్ల అతడ్ని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ అనర్హుడిగా ప్రకటించింది. ఇప్పుడు దీనిపై విచారణ చేపట్టియూనెస్ పై చర్యలు తీసుకుంటుంది. అది జీవితకాల నిషేధం అవ్వొచ్చు... లేదా కొన్ని సంవత్సరాల పాటునిషేధమైనా అవ్వొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో... 


బాక్సింగ్‌లో చెవి కొరకడం అంటే మనకు వెంటనే మైక్ టైసన్ గుర్తొస్తాడు. 1997లో ఇవాండర్ హోలీ ఫీల్డ్‌తో పోరులో టైసన్ చెవి కొరకడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.