భారత్-శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో T20 కొద్ది గంటల ముందు అనూహ్యంగా ఆగిపోయింది. భారత ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కృనాల్ పాండ్యకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య టీ20 బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
భారత క్రికెటర్లందరికీ RT-PCR టెస్టుల కోసం మంగళవారమే శాంపిల్స్ తీసుకున్నారు. తాజాగా వాటి రిజల్ట్ వచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే జట్టు మేనేజ్‌మెంట్ సిబ్బంది కృనాల్ పాండ్యను మరో హోటల్‌కి తరలించారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెటర్ బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా తెలిపారు.
కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8 మంది సభ్యులకు కూడా కరోనా రిపోర్టులో నెగిటివ్ రిజల్టే వచ్చాయి. కానీ, ముందు జాగ్రత్త కోసం భారత్ ఈ 8మందిని కూడా ఈ రోజు మ్యాచ్‌లో ఆడించడంలేదు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్లో సుమారు ఆరు మార్పులు జరిగే అవకాశం ఉంది.
బుధవారం, గురువారాల్లో రెండు T20లు ఆడిన తర్వాత ఈ నెల 30న టీమిండియా తిరిగి భారత్ చేరుకోనుంది. జట్టుతో పాటు కృనాల్ భారత్ వచ్చే పరిస్థితి లేదు. అతడు క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత నిర్వహించే RT-PCR పరీక్షలో నెగిటివ్ వచ్చిన వెంటనే అతడు భారత్‌కు వస్తాడు. అప్పటి వరకు అతడు అక్కడే ఉంటాడు.
షా, సూర్య ఆలస్యం
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు అక్కడికి వెళ్లేందుకు ఆలస్యమయ్యేట్ల ఉంది. కృనాల్‌కు పాజిటివ్ రావడంతో ఇప్పుడు వీరిద్దరూ బుడగలో ఉండాలి. మామూలుగా అయితే వీరిద్దరూ లంక పర్యటన ముగియగానే ఇంగ్లాండ్ బయలుదేరాల్సి ఉంది. కానీ, ఇప్పుడు కృనాల్‌కు పాజిటివ్ రావడంతో వీరు కొద్ది రోజులు ఆలస్యంగా ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం ఉంది.
ఈ రోజు శ్రీలంకతో జరిగే రెండో T20 లో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. కృనాల్ స్థానం కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది. తొలి T20కి రెండో మ్యాచ్‌కి జట్టులో బాగానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి శ్రీలంక టూర్‌కి భారీ జట్టునే భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. 20 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు స్టాండ్ బై నెట్ బౌలర్లు కూడా ప్రస్తుతం లంకలో టీమ్‌తో ఉన్నారు. దీంతో.. కృనాల్ పాండ్యాతో పాటు 8 మంది టీమ్‌కి దూరమైనా.. మ్యాచ్ ఆడగలిగే టీమ్ అక్కడ ఉంది. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న ఆ 8 మంది పేర్లని మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ గోప్యంగా ఉంచుతోంది.