టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకున్నాడు. దీంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో పసిడి పోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీ పోరులో 7-9 తేడాతో కజకిస్థాన్ ఆటగాడు సనయెవ్ నురిస్లామ్‌ను ఓడించాడు.
తొలి రెండు మ్యాచుల్లో ప్రత్యర్థులపై అద్భుతమైన విజయాలు అందుకున్నాడు రవి. కానీ, సెమీస్‌లో రవికి కఠినమైన సవాలే ఎదురైంది. నురిస్లామ్ మొత్తంగా ఆధిపత్యం చెలాయించాడు. తొలుత రిఫరీ నిర్దేశించిన 30 సెకన్లలో రవి పాయింటు తేకపోవడంతో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతలోనే పుంజుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్లు సాధించి 2-1తో ఫస్ట్ పిరియడ్‌ను ముగించాడు.
ఇక కీలకమైన రెండో పిరియడ్ ప్రారంభంలో పోరు ఇద్దరి మధ్యా నువ్వా నేనా అన్నట్లు సాగింది. రవి రెండు కాళ్లను గట్టిగా పట్టుకున్న నురిస్లామ్ అతడిని మెలికలు తిరిగేలా చేశాడు. దీంతో వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు సాధించాడు. దీంతో ప్రత్యర్థి నురిస్లామ్ 9-2తో అందనంత ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మ్యాచ్ చూస్తున్న వాళ్లందరూ ఇక రవి గెలవడం కష్టమే అనుకున్నారు.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రవి ఫైనల్‌కి వెళ్లడం ఖాయం అనుకున్నారు. సరిగ్గా అప్పుడే అభిమానులు కోరుకున్నట్లు గానే అద్భుతం జరిగింది. వెంటనే పుంజుకున్న రవి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. వెంటనే అతని ఖాతాలోకి 1, 2 ,2 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో ప్రత్యర్థి ఆధిపత్యాన్ని 7-9కి తగ్గించాడు. ఇప్పుడు కదా అసలు మజా. సర్వత్రా ఉత్కంఠ. చివరి నిమిషం వరకు పోటీలో ఎవరు గెలుస్తారా అని? సరిగ్గా అదే సమయంలో ప్రత్యర్థి నురిస్లామ్ గాయపడ్డాడు. ఇది మన రవికి కలిసొచ్చింది. ఇదే అదనుగా భావించిన రవి ప్రత్యర్థిని 30 సెకన్లపాటు పూర్తిగా లేవకుండా ఉక్కిరిబిక్కిరి చేసి రింగులోనే అడ్డుకోగలిగాడు. విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఫైనల్‌కు చేరుకున్నాడు.
భారత్ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన రెండో ఆటగాడు రవి కుమార్ దహియా. అంతకు ముందు సుశీల్ కుమార్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకొని రజతం సొంతం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కాంస్యం గెలిచాడు. 2012లో యోగేశ్వర్ కాంస్యం గెలిచాడు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత రవి రూపంలో మరో భారత రెజ్లర్ ఫైనల్ చేరాడు.