టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన గ్రూప్-ఎ అర్హత పోటీల్లో నీరజ్ జోప్రా జావెలిన్‌ని 86.65 మీటర్లు విసిరాడు. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి అర్హత సాధించిన తొలి భారత జావెలిన్ త్రోయర్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. అర్హత పోటీల్లో తొలి ప్రయత్నంలో‌నే జావెలిన్‌ని 86.65 మీ విసరడం ద్వారా ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకున్నాడు. గ్రూప్-ఎలో చోప్రానే టాప్‌ర్‌గా నిలిచాడు. ఇదే ప్రదర్శన ఫైనల్స్‌లోనూ నీరజ్ చోప్రా రిపీట్ చేస్తే తప్పకుండా పతకం ఖాయం. 


మ్యాచ్ అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ... ‘ఇది నాకు తొలి ఒలింపిక్స్. వార్మప్‌లో నా ప్రదర్శన మెరుగ్గా లేదు. కానీ.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే త్రో బాగా కుదిరింది. సెకండ్ త్రో ఫర్‌ఫెక్ట్. అయితే.. ఫైనల్లో ఫీలింగ్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లతో అక్కడ పతకం కోసం పోటీ పడాలి. కాబట్టి.. మానసికంగానే కాదు... శారీరకంగా కూడా ఎంతో ప్రిపేరష్ అవ్వాలి. ఫైనల్లో హై స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తా. అలాగే పతకం సాధించేందుకు కూడా నా వంతు కృషి చేస్తా’ అని నీరజ్ చోప్రా అన్నాడు. 
ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్‌ అథ్లెట్‌ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్‌ చోప్రా నిలిచాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ ఈనెల 7న జరగనుంది.






మరోవైపు జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ శివ్‌పాల్ సింగ్‌ నిరాశపరిచాడు. గ్రూప్‌-బి క్వాలిఫై రౌండ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 83.50మీ మార్క్‌ని అందుకున్న జావెలిన్ త్రోయర్లు, టాప్-12లో నిలిచిన త్రోయర్లు ఫైనల్‌కి అర్హత సాధిస్తారు. పతకాల కోసం ఫైనల్ పోరు శనివారం(ఆగస్టు 7న) జరగనుంది. హర్యానాకి చెందిన నీరజ్ చోప్రా ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07మీ.. 2021 మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫ్రిక్స్ 3లో ఈ త్రో విసిరాడు. ఇదే ప్రదర్శన చేస్తే కచ్ఛితంగా చోప్రాకి ఏదో ఒక పతకం ఖాయం. చోప్రాకి పతకం దక్కే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.