టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు, పతకాలు తెచ్చే క్రీడాకారులకు దేశంలోని పలు రాష్ట్రాలు నజరానాల మీద నజరానాలు ప్రకటించారు. లక్షల నుంచి కోట్ల రూపాయలతో పాటు ప్రత్యేక హోదాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. 


కాగా, తాజాగా ప్రముఖ మల్టీప్లెక్స్ ‘ఐనాక్స్’ కూడా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.  


టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు లైఫ్ లాంగ్ మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ అందరికీ ఒక ఏడాది పాటు ఈ ఆఫర్ వర్తింపజేస్తామని ట్విటర్ పేజీ ద్వారా ఐనాక్స్ వెల్లడించింది. 






ఇదిలా ఉండగా...టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మీరాబాయి చానుకు ఇప్పటికే డొమినోస్ పిజ్జా లైఫ్‌ టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మీరాబాయికి లైఫ్‌ టైం ఫ్రీగా పిజ్జాలు ఇస్తామని తెలిపింది. పతకం గెలిచిన తర్వాత చాను మాట్లాడుతూ... తనకు పిజ్జా తినాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో డోమినోస్ పిజ్జా చానుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన మీరాబాయిపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ.2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా, మణిపూర్ సర్కార్ కూడా కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది.      




 


క్లాస్ -1 ప్రభుత్వ ఉద్యోగం


క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోం సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడకారులకు అసోంలో క్లాస్ -1 ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. కామన్ వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్‌లలోనూ పతకాలు గెలిచిన క్రీడాకారులకు క్లాస్ -2, క్లాస్ -3 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని సీఎం శర్మ చెప్పారు. అసోం పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకువస్తామని, దీనిపై నివేదిక సమర్పించేందుకు రిటైర్డు ఐఎఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ నేతృత్వంలో పోలీసు కమిషన్‌ను నియమించామని సీఎం చెప్పారు.