ఒలింపిక్ బాక్సింగ్ వేదిక చాలా దూరంలో ఉన్న నేపథ్యంలో.. అలసట, కరోనా ముప్పును తప్పించుకోవడం కోసం ఒలింపిక్ గ్రామంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే సాధన చేయాలని భారత బాక్సర్లు నిర్ణయించుకున్నారు.
ఒలింపిక్ బాక్సింగ్ పోటీలు ర్యొగోకు కొకుగికన్ ఎరీనాలో జరుగుతాయి. ఒలింపిక్ గ్రామానికి ఈ వేదిక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘‘ఒలింపిక్ విలేజ్‌లోనే సాధన చేయాలని నిర్ణయించుకున్నాం. సోమవారం పోటీలు జరిగే వేదిక వద్దకు వెళ్లాం. అది చాలా దూరంలో ఉంది. మేమే కాదు.. ఇతర జట్లు కూడా క్రీడా గ్రామంలో సాధన చేయడమే మేలని భావిస్తున్నాయి. వాతావరణం చాలా వేడిగా ఉంది. సాధన కోసం అంత దూరం వెళ్లి.. అలసిపోవడం అనవసరం అనిపిస్తోంది. పైగా కరోనా ముప్పు కూడా పొంచి ఉంది’’ అని భారత బాక్సింగ్ బృందంలో ఒకరు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తొమ్మిది మంది భారత బాక్సర్లు పోటీపడనున్నారు. వీరిలో వికాస్ కృషన్, మేరీకోమ్‌కు మాత్రమే ఇంతకుముందు ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం ఉంది. ఈ నెల 24 బాక్సింగ్ పోటీలు ఆరంభమవుతాయి.
ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్న భారత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళా షూటర్ల సాధనకు కావాల్సినంత సమయం లభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అసాక షూటింగ్ రేంజ్‌లో భారత క్రీడాకారిణులు అపూర్వి చండేలా, ఎలవెనిల్ వలెరివన్‌లు కేవలం 20 నిమిషాలు మాత్రమే సాధన చేయగలిగారు. మిగతా భారత షూటర్లు రెండు గంటలకు పైగానే సాధన చేశారు. ‘‘అన్ని దేశాల క్రీడాకారులు ఒకే వేదికలో సాధన చేయడం వల్ల సమయం కేటాయింపులో సమస్య ఏర్పడింది. ఉదయం భారత క్రీడాకారులు 2 నుంచి రెండున్నర గంటలు ప్రాక్టీస్ చేశారు. 10 మీ ఎయిర్ రైఫిల్ జట్టుకు 20-30 నిమిషాల సమయం లభించింది’’ అని భారత జాతీయ రైఫిల్ సంఘం పేర్కొంది. శనివారం మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్‌లో పోటీలు జరుగనున్నాయి.
జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఈ క్రీడలు ఈ ఏడాది జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోక్యో చేరుకున్న భారత క్రీడాకారులు తమకు కేటాయించిన స్లాట్లల్లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడాకారులు క్రీడా గ్రామంలో ఉంటున్నారు. క్రీడా గ్రామంలో ఇప్పటికి కూడా కరోనా పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నారు. దీంతో పలువురు ఆటగాళ్లు ఆందోళన చెందుతూనే ఉన్నారు. క్రీడలు జరుగుతాయా అన్న సందేహాలు ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శుక్రవారం(23న) ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు రెండు రోజుల ముందు నుంచే పోటీలు మొదలయ్యాయి.