Indian Cricketers Who May Retire From International Cricket In 2023: గత ఏడాది శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో తమదైన ముద్ర వేశారు. తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలాగే భారతీయ ఆటగాళ్లలో చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పవచ్చు. నిజానికి ఈ లిస్ట్‌లో చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ఛాన్స్ ఉన్న ఐదుగురు భారతీయ ఆటగాళ్లను చూద్దాం.


అమిత్ మిశ్రా
భారత ఆటగాడు అమిత్ మిశ్రా వయసు 40 ఏళ్లు దాటింది. ఇది కాకుండా అతను చాలా కాలం పాటు టీమ్ ఇండియా జట్టులో భాగం కాదు. అయితే అమిత్ మిశ్రా ఐపీఎల్‌ను మాత్రం కంటిన్యూగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ లెగ్ స్పిన్నర్ భారత్ తరఫున 22 టెస్టు మ్యాచ్‌లతో పాటు 36 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అమిత్ మిశ్రా ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పవచ్చు.


పీయూష్ చావ్లా
2011లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ప్రపంచకప్ గెలిచిన జట్టులో పీయూష్ చావ్లా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. అయితే అతను చాలా కాలంగా భారత జట్టులో స్థానం పొందలేదు. పీయూష్ చావ్లా వయసును దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


కరుణ్ నాయర్
కరుణ్ నాయర్ 2016 సంవత్సరంలో ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా చాలా వార్తల్లో నిలిచాడు. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు, కానీ భారత జట్టులో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అతను ఏదో ఒక IPL జట్టులో భాగంగా కొనసాగాడు. అంతే కాకుండా దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ సెలక్టర్లను మాత్రం మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం కరుణ్ నాయర్ చాలా కాలంగా భారత జట్టులో లేడు. అదే సమయంలో ఈ కర్ణాటక ప్లేయర్ ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చు.


కేదార్ జాదవ్
కేదార్ జాదవ్ భారత జట్టు తరఫున వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాడు. ఇది కాకుండా అతను ఐపీఎల్‌లో మాత్రం నిరంతరం ఆడుతున్నాడు. కేదార్ జాదవ్ టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కాకుండా బౌలింగ్‌లో కూడా సహకారం అందించాడు. అయితే ఈ ఆటగాడు చాలా కాలంగా భారత క్రికెట్ జట్టులో భాగం కాలేదు. ఈ ఏడాది కేదార్ జాదవ్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి సంవత్సరం కావచ్చని భావిస్తున్నారు.


దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్ అంతర్జాతీయ కెరీర్ చాలా సుదీర్ఘమైనది. అయినప్పటికీ అతనికి జట్టులో చోటు దక్కడం అంత సులభం కాలేదు. దీంతో పాటు ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ ధర ఎప్పుడూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ ప్రదర్శన కూడా అద్భుతం. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ భారత జట్టులో భాగమైనప్పటికీ మంచి ప్రదర్శన చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది దినేష్ కార్తీక్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు.