Thailand Open PV Sindhu Bows Out After Losing In Semifinals To Chen Yu Fei : థాయ్‌ల్యాండ్ ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది! టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్‌యూఫీ చేతిలో ఓటమి పాలైంది. మహిళల సెమీస్‌లో 17-21, 16-21 తేడాతో వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఫైనల్‌కు చేరుకోకుండానే వెనక్కి మళ్లింది.
ఈ టోర్నీలో పీవీ సింధు ఆరో సీడ్‌గా బరిలోకి దిగింది. ఈ మ్యాచుకు ముందు ప్రత్యర్థి చెన్ యూఫీపై 6-4 తేడాతో ఆమెదే పైచేయి. చివరిసారిగా వీరిద్దరూ 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తలపడ్డారు. అప్పుడు చెన్‌దే విజయం. అదే జోరును ఆమె ఇప్పుడూ కొనసాగించింది.
సెమీస్ మొదటి గేమ్‌లో మొదట సింధు, చెన్ 3-3తో సమంగా ఉన్నారు. అదే సమయంలో చెన్ విజృంభించి 11-7తో సింధును వెనక్కి నెట్టింది. ఆ తర్వాత వరుసగా ర్యాలీలు ఆడుతూ ఆధిపత్యం చెలాయించింది. చివరి ఐదు గేమ్ పాయింట్లు అందుకొని విజయం సాధించింది.
రెండో గేమ్‌లో సింధు కాస్త దూకుడుగానే ఆడింది. 6-3తో పైచేయి సాధించింది. రెండు పాయింట్ల కుషన్‌తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత చెన్ చెలరేగింది. 15-12తో ముందుకెళ్లింది. ఆమె జోరును సింధు అడ్డుకోకపోవడంతో నాలుగు మ్యాచ్ పాయింట్లు సాధించిన చెన్ సునాయాసంగా గెలుపు తలుపు తట్టింది.
ఈ సీజన్లో సింధు ప్రదర్శన ఫర్వాలేదు. రెండు సూపర్ 300 టైటిళ్లు గెలిచింది. సయ్యద్ మోదీ, స్విప్ ఓపెన్ విజేతగా నిలిచింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్న ఈ తెలుగు తేజం జూన్ 7 నుంచి 12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో పాల్గొంటుంది.