స్విట్జర్లాండ్‌కు చెందిన  దిగ్గజ టెన్నిస్  ఆటగాడు రోజర్  ఫెదరర్ ప్రొఫెషనల్  టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పేశాడు. కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ లను ఫెదరర్  గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. లండన్  వేదికగా సెప్టెంబర్  23వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు జరిగే లావెర్  కప్  ఏటీపీనే తనకు చివరదని రిటైర్మెంట్ సందర్భంగా ప్రకటించాడు. ఆరు సార్లు ఆస్ట్రేలియన్  ఓపెన్ టైటిల్, ఎనిమిదిసార్లు వింబుల్డన్ టైటిల్, ఐదుసార్లు యూఎస్  ఓపెన్  టైటిల్, ఒకసారి ఫ్రెంచ్  ఓపెన్ టైటిళ్లను రోజర్ ఫెదరర్ కైవసం చేసుకొన్నాడు. భవిష్యత్తులో ఇంకా టెన్నిస్  ఆడతానని, కానీ ఏటీపీ, గ్రాండ్ స్లామ్  పోటీల్లో ఆడనని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.


1998లో ప్రొఫెషనల్  టెన్నిస్  ఆటగాడిగా మారిన ఫెదరర్  24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 1251 విజయాలను సాధించాడు. ఓటములు కేవలం 275 మాత్రమే. అంటే విజయాల శాతం 82కు పైనే. 2012 లండన్  ఒలింపిక్స్  సింగిల్స్ విభాగంలో రజతం, 2008 బీజింగ్  ఒలింపిక్స్  డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలను కూడా ఫెదరర్ అందుకొన్నాడు. ఫెదరర్  కొంతకాలంగా గాయాలతో బాధపడుతూ ఇబ్బందిపడ్డాడు. దీంతో గత యూఎస్  ఓపెన్ లోనూ రోజర్ పాల్గొనలేకపోయాడు.