నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానే అత్యాచార కేసులో దోషిగా తేలాడు. టీనేజ్ అమ్మాయిని రేప్ చేసిన‌ట్లు లామిచానేపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో తీర్పును జ‌న‌వ‌రి 10వ తేదీన వెలువ‌రించ‌నుండగా.... ఈ క్రికెటర్‌కు ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. 23 ఏళ్ల సందీప్ నేపాల్‌లో మేటి క్రికెట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అనేక టీ20 టోర్నీల్లో అత‌ను ఆడాడు. లామిచానేపై రేప్ కేసు న‌మోదు కావ‌డంతో అత‌న్ని గ‌త ఏడాది నేపాల్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించారు. అరెస్టు వారెంట్ జారీ చేసి అత‌న్ని క‌స్టడీలోకి తీసుకున్నారు. ఇటీవ‌ల అత‌న్ని బెయిల్‌పై రిలీజ్ చేశారు. కానీ ఆ కేసులో ల‌మిచానేకు ప‌దేళ్ల శిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యున్నత కోర్టులో దీనిపై అప్పీల్ చేయ‌నున్నట్లు లామిచానే లాయ‌ర్ స‌బితా భండారి బ‌రాల్ తెలిపారు.


ఐపీఎల్‌లో ఆడిన మొదటి నేపాలీ
 ఐపీఎల్‌లో ఆడిన మొదటి నేపాల్‌ ఆటగాడిగా గుర్తింపు పొందిన సందీప్ లామిచానే.. లెగ్‌స్పిన్నర్‌గా అనతి కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా బిగ్‌బాష్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లాంటి లీగ్‌ల్లో ఆడుతున్నాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా, టీ20ల్లో వేగంగా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అతను నిలిచాడు. చివరగా ఈ ఏడాది ఆగస్టులో కెన్యాతో టీ20లో నేపాల్‌ తరపున ఆడాడు.  


అండర్‌ 19 ప్రపంచకప్‌నకు నేపాల్‌ అర్హత
వచ్చే జనవరిలో జరగనున్న U19 ప్రపంచ కప్ 15వ ఎడిషన్. చివరగా 2022లో వెస్టిండీస్‌లో జరిగిన మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఐదవసారి టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. 2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు. అండర్ 19 వరల్డ్ కప్ లో పాల్గొనే 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ Cలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Dలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ టీమ్స్ సూపర్ సిక్స్ కోసం పోటీ పడనున్నాయి. 
 2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ (Under19 Mens World Cup 2024) హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. లంక క్రికెట్ కి నిధులు ఐసీసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది.