ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రేపటి (సెప్టెంబరు 2) నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ చేసింది. అదేంటంటే... స్టాండ్ బై ఆటగాడిగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రసిద్ధ్ కృష్ణ ఆశ్చర్యకరంగా జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ మేరకు BCCI అధికారిక ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 






టీమిండియా మేనేజ్‌మెంట్ కోరిక మేరకు ఆల్ ఇండియా సీనియర్ కమిటీ నాలుగో టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే జట్టులో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించింది. ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియా జట్టుతోనే ఉన్నాడని కమిటీ తెలిపింది. ఇరు జట్ల మధ్య లండన్‌లోని ఓవల్‌లో నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది.


హెడింగ్లీ టెస్టులో ఘోర పరాజయం నుంచి టీమిండియా బలంగా పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రేపు టాస్ వేసే సమయం వరకు వేచి చూడాల్సిందే. 


ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు? 


ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో చోటు దక్కించుకోవడంపై అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా బౌలర్ గాయపడినందుకు అతడ్ని జట్టులోకి తీసుకున్నారా? సిరాజ్, ఇషాంత్, బుమ్రా, షమితో పాటు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఇప్పటికే జట్టులో ఉన్నారు. ఇప్పటికే జట్టులో ఆరుగురు పేసర్లు ఉన్నారు. మరి, ఇలాంటప్పుడు అతడికి జట్టులో స్థానం కల్పించడంపై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 






నాలుగో టెస్టు కోసం భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సాహా (వికెట్ కీపర్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.