Ravindra Jadeja Injury: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత కోలుకొనేందుకు ఎక్కువ సమయం పట్టడమే ఇందుకు కారణం. కాగా మ్యాచు ఆడుతూనో, ఫీల్డింగ్ డ్రిల్స్‌లోనూ జడ్డూ గాయపడలేదని తెలిసింది. పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచుకు ముందు సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయబోయి మోకాలు మడత పడిందని సమాచారం.
ఆసియాకప్ లీగు మ్యాచుల్లో రవీంద్ర జడేజా కీలకంగా మారాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతూనే వేగంగా బౌలింగ్ చేశాడు. పరుగుల్ని నియంత్రించాడు. సూపర్-4 దశలోనూ అలాంటి ఫామే కొనసాగించాలని అభిమానులు ఆశించారు. అలాంటి టైమ్‌లో మొత్తంగా టోర్నీకే దూరమైన అవాక్కయ్యేలా చేశాడు. రెండు మ్యాచుల్లో బౌలింగ్ చేసేటప్పుడు బాగానే కనిపించిన జడ్డూ అసలు ఎలా గాయపడ్డాడబ్బా అన్న సందేహాలు తలెత్తాయి.
సూపర్ 4 దశకు ముందు దుబాయ్ సముద్ర జలాల్లో ఓ సాహస కృత్యం చేయడమే గాయానికి కారణమని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. స్కై బోర్డుపై ఉండగా బ్యాలెన్స్ కోల్పోవడంతో అతడి కాలు మడత పడిందని తెలిసింది. అంతకు ముందు గాయపడిన చోటే మళ్లీ గాయమైంది. అతడిని పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేశాక శస్త్రచికిత్స చేయాల్సిందేనని సూచించారు. రెండు రోజులు ముందే అతడి సర్జరీ విజయవంతం అయింది.
'ఓ సాహస కృత్యంలో భాగంగా రవీంద్ర జడేజా స్కై బోర్డుపై బాలెన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడే అతడు పట్టు తప్పి కిందపడ్డాడు. కాలు మడత పడటంతో మోకాలికి దెబ్బ తగిలింది. ఫలితంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇది టీమ్‌ఇండియా ట్రైనింగ్ మాన్యువల్‌లో లేదు. అసలీ యాక్టివిటీ అవసరమే లేదు' అని బోర్డు వర్గాలు సమాచారం అందించాయి.
సర్జరీ తర్వాత జడ్డూ సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ చేశాడు. 'శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వారు ఎంతోమందున్నారు. బీసీసీఐ, సహచరులు, సహాయ సిబ్బంది, ఫిజియోలు, వైద్యులు, అభిమానులు ధన్యవాదాలు. నేను అతి త్వరలోనే రిహబిలిటేషన్‌కు వెళ్తాను. సాధ్యమైనంత వేగంగా తిరిగొస్తాను. మీ విషెస్‌కు కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి రెండు చిత్రాలు అటాచ్ చేశాడు.
ఐపీఎల్ 15వ సీజన్‌కు ముందు జడ్డూ గాయంతో సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. చెన్నైకి ఆడుతుండగానే గాయంతో మధ్యలోనే వెళ్లిపోయాడు. మోకాలి గాయంతోనే జులైలో వెస్టిండీస్ సిరీసుకు దూరమయ్యాడు. మళ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఆసియాకప్‌కు ఎంపికయ్యాడు. పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచులో మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాయాదితో పోరులో 148 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో వచ్చిన అతడు 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చకచకా బౌలింగ్ చేశాడు. ఇక హాంకాంగ్ పోరులో బాబర్ హయత్‌ను ఔట్ చేసి 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు.