IND Vs SL 3rd T20I: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స ఆడిన దసున్ షనక (74 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా విజయానికి 120 బంతుల్లో 147 పరుగులు కావాలి. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.


షనక షో...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు తమ నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. నాలుగో ఓవర్లలో 11 పరుగులకే టాప్-3 బ్యాట్స్‌మెన్ పతుం నిశ్శంక (1), దనుష్క గుణతిలక (0), చరిత్ అసలంక (4) అవుటయ్యారు. వీరిలో నిశ్శంక, అసలంకల వికెట్లు అవేష్ ఖాన్‌కు దక్కగా... గుణతిలకను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.


దీంతో రన్‌రేట్ కూడా చాలా మందగించింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్లో జనిత్ లియనగే (9) కూడా అవుట్ కావడంతో... 29 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. వికెట్ కీపర్ దినేష్ చండీమాల్, కెప్టెన్ దసున్ షనక కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. ఈ దశలో చండీమాల్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని హర్షల్ పటేల్ విడదీశాడు.


ఫాంలో ఉన్న కెప్టెన్ షనకకు... చమీర కరుణరత్నే (12 నాటౌట్: 19 బంతుల్లో) జతకలిశాడు. కరుణ రత్నే క్రీజులో ఎంతో ఇబ్బందిగా కనిపించగా... షనక మాత్రం చెలరేగిపోయాడు. గత మ్యాచ్ తరహాలోనే స్లాగ్ ఓవర్లలో బీస్ట్ మోడ్‌లోకి వచ్చేశాడు. మొదటి మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన అవేష్ ఖాన్ నాలుగో ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. షనక, కరుణ రత్నే ఆరో వికెట్‌కు 47 బంతుల్లోనే 86 పరుగులు జోడించారు.


చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 69 పరుగులను శ్రీలంక సాధించడం విశేషం. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి లంకేయులు ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగారు. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా... సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.