Russia-Ukraine war teaches India: భారతదేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మనకు చెబుతోందని వెటరన్ బ్యాంకర్ ఉదయ్ కొటక్ అన్నారు. ఆయుధాల కోసం మనమింకా అమెరికా, రష్యాలపై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. వీలైనంత వేగంగా 'ఆత్మనిర్భర్ భారత్'ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.
'ఇండియాకు పక్కనున్న పాకిస్థాన్, చైనా దేశాలు అణు సామర్థ్యం ఉన్నవి. మనమింకా మిలటరీ ఆయుధ వ్యవస్థల కోసం అమెరికా, రష్యాపై ఆధారపడుతున్నాం. మనకెన్నో సవాళ్లు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మనకు చెబుతున్నది ఒకటే : 'ఆత్మ నిర్భర్ భారత్' అని ఉదయ్ కొటక్ ట్వీట్ చేశారు.
భారత్ ఇప్పటికీ ఆయుధాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. మనకు ఎక్కువ ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా ఉంది. గతేడాది డిసెంబర్లో భారత్, రష్యా సైన్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో, రష్యా రైఫిల్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా 6 లక్షల K-203 అసాల్ట్ రైఫిల్స్‌ను ఇండియాలో తయారు చేసేందుకు రెండు దేశాలు సంతకం చేసుకున్నాయి.
S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం 2018లో రష్యాతో 5.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఇప్పటికే సరఫరా మొదలైంది. పంజాబ్‌లో మొదటి S-400 Missile Systemను మోహరించింది.
ఆత్మనిర్భర్ భారత్ గురించి ఉదయ్ కొటక్ ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. బడ్జెట్-2022 ప్రవేశపెట్టినప్పుడూ ఆయన ఇలాగే మాట్లాడాడు. 'బడ్జెట్: ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు నమ్మకమైన ప్రభుత్వ పాలన. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులపై మళ్లీ నమ్మకం పెంచింది. 25 ఏళ్ల విజన్‌తో పారదర్శకమైన డిజిటల్ ఇండియాను నిర్మిస్తోంది. ఒక భారతీయుడిగా నేనిందుకు గర్విస్తున్నాను' అని కొటక్ ట్వీట్ చేశారు.
రష్యా సైనిక చర్య చేపట్టడంతో ఉక్రెయిన్ అల్లాడుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మాట విని అణ్వాయుధాలను అప్పగించింది. ఇప్పుడు ప్రమాదకర, పవర్‌ఫుల్ ఆయుధాలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటోంది. అణ్వాయుధాలు ఉండుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. అందుకే మెరుగైన ఆయుధ వ్యవస్థలు, ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే స్వయంగా అభివృద్ధి చేసుకోవాలని ఉదయ్ కొటక్ సూచిస్తున్నారు.