టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపించాలనుకున్న వార్తలు నిజం కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అవి కేవలం వదంతులేనని పేర్కొన్నాడు. ఆ వార్తలు సత్య దూరంగా ఉన్నాయని వెల్లడించాడు. కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపించాలనుకున్నారా అని ఏఎన్‌ఐ ప్రశ్నించగా నిజం కాదని తెలిపాడు.


విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ రెండో దశకు ముందు టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్‌ ప్రకటించాడు. నాయకుడిగా టీ20 ప్రపంచకప్‌ చివరిదని పేర్కొన్నాడు. అయితే  దక్షిణాఫ్రికా సిరీసుకు ముందు పరిణామాలు మారిపోయాయి. సఫారీ పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను ఎంపిక చేశారు. ఆ తర్వాత విరాట్‌ను అడగ్గా కేవలం గంటన్నర ముందే తనకీ విషయం చెప్పారన్నాడు. టీ20 బాధ్యతలు వదిలేసినప్పుడు తననెవరూ అడ్డుకోలేదని, తప్పుకోవద్దని చెప్పలేదన్నాడు.






ఈ వ్యాఖ్యలు సౌరవ్‌ గంగూలీపై అనుమానాలు పెంచాయి. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గతంలో తాను వ్యక్తిగతంగా చెప్పానని దాదా పేర్కొన్న సంగతి తెలిసిందే. తనపై నింద వేసేలా మాట్లాడటంతో గంగూలీ అతడికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలనుకున్నాడని శుక్రవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. వీటిని గంగూలీ ఖండించాడు. ఇక వన్డే సిరీసుకు ముందు టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై చెప్పేయడం గమనార్హం.


కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. గెలిచే సిరీసులను వృథా చేసుకుంది. వన్డే సిరీసులోనూ 2-0తో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అందరూ రాణించారు. జానేమన్ మలన్ (91: 108 బంతుల్లో, 8 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. 


Also Read: Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!


Also Read: IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?


Also Read: David Warner: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?