Ross Taylor: ఇండియన్‌ ప్రీమియర్ లీగులో తనకు ఊహించని సంఘటన ఎదురైందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ అన్నాడు. ఓ ఫ్రాంచైజీ యజమాని ఒకరు తనపై చేయి చేసుకున్నారని పేర్కొన్నాడు. కీలకమైన ఛేదనలో డకౌట్‌ కావడంతో అతడలా చేశాడని వివరించాడు. ఉద్దేశ పూర్వకంగా కొట్టాడో లేదా సరదాగా చేశాడో తెలియదన్నాడు. ఈ మధ్యే విడుదల చేసిన తన ఆత్మ కథ 'బ్లాక్‌ అండ్‌ వైట్‌'లో ఈ ఘటన గురించి రాసుకున్నాడు.


కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఛేదనలో డకౌట్‌ అయ్యాక రాజస్థాన్‌ రాయల్స్‌ యజమాని ఒకరు తన చెంపలు వాయించారని రాస్‌ టేలర్‌ అన్నాడు. అయితే గట్టిగా కొట్టలేదని పేర్కొన్నాడు. 'రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మొహాలిలో తలపడ్డాయి. మేం 195 పరుగుల టార్గెట్‌ను ఛేదిస్తున్నాం. నేను ఎల్బీ రూపంలో డకౌట్‌ అయ్యాను. మేం కనీసం లక్ష్యానికైనా చేరువ కాలేదు' అని అతడు వివరించాడు.


'ఆ తర్వాత జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, యాజమాన్యం ఓ హోటళ్లో టాప్‌ ఫ్లోర్‌లోని బార్‌కు వెళ్లారు. షేన్‌ వార్న్‌తో పాటు లిజ్‌ హర్లీ ఉన్నారు. అప్పుడే రాయల్స్‌ యజమానుల్లో ఒకరు నా దగ్గరికి వచ్చారు. రాస్‌.. నువ్వు డకౌట్‌ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్‌ డాలర్లు ఇస్తుందని అన్నాడు. నా చెంపలపై మూడు నాలుగు సార్లు కొడుతూ నవ్వాడు' అని టేలర్‌ పేర్కొన్నాడు.


'అతడు నవ్వుతున్నాడు. పైగా గట్టిగా ఏం కొట్టలేదు. అయితే అతడు ఉద్దేశ పూర్వకంగా కొట్టాడో లేదా సరదాగా చేశాడో నేను చెప్పలేను. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్దది చేయలేదు. అయితే ప్రొఫెషనల్‌ క్రీడా టోర్నీల్లో అలాంటివి జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు' అని రాస్ టేలర్‌ పేర్కొన్నాడు. 2008 నుంచి 2010 వరకు అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడాడు. 2011లో రాజస్థాన్‌ రాయల్స్‌కు వెళ్లాడు. ఆపై దిల్లీ క్యాపిటల్స్‌కూ ఆడాడు. పుణె వారియర్స్‌కు సైతం ఆడిన అనుభవం ఉంది.