Stock Market Weekly Review: వరుస నష్టాలతో విలవిల్లాడిన భారత స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలను మదుపర్లు అధిగమించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ ఇండియా బాట పట్టారు. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త గరిష్ఠాల వైపు పరుగులు తీస్తున్నాయి. మదుపర్లకు డబ్బుల పంట పండిస్తున్నాయి. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేసినా లాభాలు మాత్రం బాగానే వచ్చాయి.


సెన్సెక్స్‌ 1600+


బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ వారం బాగానే లాభపడింది. అమెరికా ఫెడ్‌, యూఎస్‌ ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో మొదట్లో కాస్త ఊగిసలాటకు లోనైంది. క్రితం నెలతో పోలిస్తే ఈసారి ఇన్‌ఫ్లేషన్‌ స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఆగస్టు 8న సెన్సెక్స్‌ 57,823 వద్ద మొదలైంది. 57,540 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. ఆపై తేరుకొని 59,538 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 3.29 శాతం పెరిగింది. 1639 పాయింట్లు లాభపడింది. దాంతో మదుపర్లు రూ.8 లక్షల కోట్ల మేర ఆర్జించారు.




నిఫ్టీ 18000 వైపు


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదే దారి అనుసరించింది. ఆగస్టు 8న 17,402 వద్ద మొదలైంది. 17,361 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని చేరుకుంది. అక్కడ్నుంచి పుంజుకున్న సూచీ 17,724 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1.7 శాతం లాభంతో 17,698 వద్ద ముగిసింది. అంటే 296 పాయింట్ల మేర లాభపడింది. కనిష్ఠంతో పోలిస్తే 363 పాయింట్లు ఎగిసింది.


డాలర్‌ ఇంకా!


డాలర్‌తో పోలిస్తే రూపాయి కాస్త బలహీనపడింది. 79.366 వద్ద ఓపెనైంది. 79.015 వద్ద వారాంతపు గరిష్ఠాన్ని తాకింది. 79.948 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 79.641 వద్ద ముగిసింది. మొత్తం 0.35 శాతం మేర నష్టపోయింది. యూరో, ఇతర కరెన్సీలతో పోలిస్తే మాత్రం బలపడింది.


వచ్చే వారం ఏంటి?


వచ్చేవారం కంపెనీల త్రైమాసిక ఫలితాలు, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటివి ఈక్విటీ మార్కెట్లను ప్రభావం చేయనున్నాయి. సోమవారం సెలవు కావడంతో కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. సెన్సెక్స్‌ 60వేల స్థాయికి తిరిగి చేరుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఆ స్థాయిని దాటితే మార్కెట్లు మరింత వేగంగా దూసుకెళ్తాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.