Shoaib Malik Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. విడాకుల ప్రక్రియ ముగిసిందని.. కొన్ని చట్టపరమైన అంశాలు పరిష్కరించుకుని వారు అధికారికంగా ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంచితే సోమవారం అర్ధరాత్రి షోయబ్ మాలిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ఏంటా పోస్ట్
నేడు సానియా మీర్జా పుట్టినరోజు. ఇది పురస్కరించుకుని మాలిక్ తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు. వారిద్దరూ కలిసి ఉన్న చక్కని ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ రోజును పూర్తిగా ఆస్వాదించండి. అంటూ క్యాప్షన్ జతచేశాడు.
ఫ్యాన్స్ ఆనందం
షోయబ్ ఆ పోస్ట్ పెట్టిన వెంటనే అతని అనుచరులు, ఫ్యాన్స్ దానిపై వ్యాఖ్యానించారు. మీరిద్దరూ కలిసి ఉండాలని వారు సూచించారు. అలాగే కేవలం 50 నిమిషాల్లో ఆ పోస్టుకు 47 వేల లైక్స్ వచ్చాయి.
భర్త లేకుండా సానియా జన్మదిన వేడుకలు
మరోవైపు సానియా మీర్జా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. తన స్నేహితుల సమక్షంలో దుబాయ్ లో అర్ధరాత్రి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకుంది. బాలీవుడు దర్శకురాలు ఫరా ఖాన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వేడుకలో షోయబ్ మాలిక్ కనిపించలేదు. దీంతో వారి విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయింది.
కలిసి టాక్ షో
సానియా-షోయబ్ ల విడాకుల వార్తలు ఊహాగానాలేనా అనే అనుమానం కలుగుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూఫ్లిక్స్ కోసం ఈ జంట 'ది మీర్జా మాలిక్ షో' అనే టాక్ షో చేస్తుండడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించి సానియా, షోయబ్ భుజం మీద చేయి వేసి దిగిన ఫొటోను ఉర్దూఫ్లిక్స్ పోస్టు చేసింది. ఈ షో త్వరలోనే ప్రసారం అవుతుందని సదరు ఓటీటీ ప్రకటించింది.
విడాకుల వ్యవహారాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ విచిత్రంగా ఇప్పుడు నెటిజన్లు ఈ జంటను విమర్శిస్తున్నారు. ఈ దంపతులు ప్రచారం కోసమే విడాకుల నాటకాలు ఆడుతున్నారంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ షో షూటింగ్ గతంలోనే జరిగి ఉంటుందని.. ప్రసారానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విడాకుల ప్రకటన వాయిదా వేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం విడాకులపై ఈ జంట అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు.