G20 summit: ఇండోనేసియాలో జరుగుతోన్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు.. బ్రిటన్ ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్‌ను.. మోదీ కలిశారు. ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రిషి.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీని తొలిసారి కలిశారు.
జీ-20 సదస్సు తొలి రోజు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. సునక్‌తోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మూన్యుయేల్ మేక్రాన్లను ప్రధాని మోదీ కలిశారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా మోదీ చర్చలు జరిపారు. రిషి సునక్, మేక్రాన్‌లతో బుధవారం మోదీ విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. - ప్రధానమంత్రి కార్యాలయం
మోదీ ప్రసంగం
అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద మాట్లాడారు. ఆ సమయంలో ఉక్రెయిన్ పరిణామంపై కూడా స్పందించారు.
కాల్పుల విరమణ, దౌత్య మార్గాల దిశగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడింది. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ తర్వాత.. శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ సమయంలో ప్రపంచ శాంతి, సామరస్యాలను కాపాడటం మన బాధ్యత. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో (భారత్) జీ20 సమావేశమైనప్పుడు మనమంతా శాంతి అనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి చాటాలి. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Morbi Bridge Collapse: మోర్బీ వంతెన ఘటనపై హైకోర్టు సీరియస్- గుజరాత్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం