Morbi Bridge Collapse: గుజరాత్ మోర్బీ తీగల వంతెన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా గుజరాత్ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బ్రిడ్జ్ మరమ్మతు, నిర్వహణ కోసం కాంట్రాక్టు ఇచ్చిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
ఈ మేరకు గుజరాత్ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరుస ప్రశ్నలు వేశారు. మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను గుజరాత్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం.
గైర్హాజరు
మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని గుజరాత్ సర్కార్‌ను హైకోర్టు నిలదీసింది.
ఇలా ప్రమాదం
బ్రిటీష్ కాలం నాటి తీగల వంతెన ఇటీవల కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. సందర్శకులు నదిలో పడిపోగానే ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి.
ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది వరకు మృతి చెందారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు.