Shoaib Malik Reacts On His 3rd Marriage And Divorce To Sania Mirza: సానియా మీర్జా(Sania Mirza)కు విడాకులు ఇచ్చి , పాకిస్థాన్ నటి సనా జావేద్‌(Sana Javed)ను  పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) వ్యవహారం చర్చనీయాంశంగామారిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే షోయబ్‌ మాజీ భార్య టెన్నిస్ స్టార్‌ సానియాకు పాకిస్థాన్‌ ప్రజల నుంచి మద్ధతు లభిస్తోంది. షోయబ్‌-సనాతో రిలేషన్‌లో ఉంటూ సానియాను మోసం చేశాడని పాకిస్థాన్‌ మీడియా కథనాలు వైరల్‌ అయ్యాయి. షోయబ్‌ పచ్చి మోసగాడంటూ, సానియాపై నెటిజన్లు సింపతి చూపిస్తున్నారు.  ఈ నేపధ్యంలో  షోయబ్‌పై  విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది. అయితే దీనిపై షోయబ్‌ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అఇయతే తాజాగా నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై ఓపెన్‌ అయ్యారు. అయితే నేరుగా కాకుండా, పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు షోయబ్‌. 


"నేను చెప్పేది ఒకటే.. మీ మనసు మీకు ఏం చెబుతుందో అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో.. వేరే వాళ్లు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకూడదు. మీరు ఏదైనా ప్రయాణం చేస్తుంటే.. ప్రజలు ఏమనుకుంటారు అనేది అర్థం చేసుకునేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు. కొందరికి ఇది అర్థం కావడానికి 10 ఏళ్లు పట్టొచ్చు లేదా 20 ఏళ్లు పట్టొచ్చు. 20 ఏళ్ల తర్వాత మీరు అసలు విషయం అర్థం చేసుకున్నా సరే ముందుసాగండి" అని షోయబ్ మాలిక్ నర్మగర్బ వ్యాఖ్యలు చేశాడు.  అంటే ప్రత్యక్షంగా కాకున్నా  షోయబ్ మాటలు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా, మనస్సును అనుసరించాలనే దృఢమైన వైఖరిని చెప్పకనే  చెబుతున్నాయి.


స్పందించిన సానియా మీర్జా

సానియా తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుందని ఈ టెన్నీస్‌ స్టార్‌ తరపున ఒక ప్రకటన విడుదలైంది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు పంచుకోవాల్సి వచ్చిందని... షోయబ్‌ మాలిక్‌‌తో కొన్ని నెలల కిందటే సానియా విడాకులు తీసుకుందని సానియా తరపున విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే షోయబ్‌ కొత్త ప్రయాణం బాగుండాలని కోరుకుంటూ సానియా శుభాకాంక్షలు తెలిపిందని... ఈ సమయంలో సానియా గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నామని సానియా తరపున ప్రకటన విడుదల చేశారు. ఈ సున్నితమైన సమయంలో అభిమానులు...  శ్రేయోభిలాషులందరూ ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా  సానియా గోప్యతను పాటించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  

 


2010లో ప్రేమ వివాహం

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 లో పాక్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇజాబ్ అనే కుమారుడు ఉన్నాడు.  వీరిద్దరు విడాకులు తీసుకున్నారని, విడివిడిగా ఉంటున్నారని చాలాసార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంత కాలంగా సానియా పాకిస్థాన్‌లో కంటే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో షోయబ్ మాలిక్ సైతం ట్విటర్ అకౌంట్‌లో రిలేషన్‌షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా నేమ్‌ను తీసేశాడు. తాజాగా సానియా తన ఇన్‌స్టా నుంచి షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో సానియా- షోయబ్‌ త్వరలోనే డివోర్స్ తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.