Sanju Samson: టీమ్‌ఇండియా యువ ఆటగాడు సంజు శాంసన్‌ తమ ప్రణాళికల్లో ఉన్నాడని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అంటున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడిని భాగం చేశామని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడెంతో ఉపయోగపడతాడని వెల్లడించాడు.


శ్రీలంకతో త్వరలో జరగబోయే టీ20 సిరీసుకు సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు. ఈ సిరీసులో రిషభ్ పంత్‌కు విశ్రాంతినిచ్చారు. దాంతో వికెట్‌ కీపర్లుగా ఇషాన్‌ కిషన్‌తో పాటు అతడికీ చోటిచ్చారు. ఈ మధ్య కాలంలో ఇషాన్‌ ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది శ్రీలంకకు భారత ద్వితీయ శ్రేణి జట్టును పంపినప్పుడు సంజు అక్కడికి వెళ్లాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. అతడికి మరోసారి అవకాశం ఇస్తున్నారు.


'సంజు మా ప్రణాళికల్లో ఉన్నాడు. అంతకన్నా ముఖ్యంగా మేం ఆస్ట్రేలియా వికెట్లపై ఎవరెవరు ఉపయోగపడతారో పరీక్షిస్తున్నాం' అని బీసీసీఐ చీఫ్ సెలకక్టర్‌ చేతన్‌ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసీస్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా చాలా ప్రయోగాలు చేస్తోంది. యువ క్రికెటర్లను పరీక్షిస్తోంది.


సంజు శాంసన్ అద్భుతమైన క్రికెటరే అయినా నిలకడగా రాణించడం లేదు. చివరిసారిగా అతడు 2021, జులైలో శ్రీలంకపై పొట్టి సిరీస్‌ ఆడాడు. అంతకన్నా ముందు అతడు 2015లోనే టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటి వరకు 10 మ్యాచులకు మించి ఆడలేదు. 11.70 సగటుతో కేవలం 117 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 27. అతడి వయసు కూడా ఇప్పుడు 27 ఏళ్లు.


టీ20 జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శామ్సన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), అవేష్ ఖాన్


టెస్టు జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరబ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్)