East Godavari Lorry Incident: తూర్పుగోదావరి జిల్లా: హైవే పై లారీని ఆపేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. దోచుకునేందుకు చేసే ప్రయత్నాన్ని గ్రహించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో డ్రైవర్ గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగింది అని ప్రచారం జరిగింది. అయితే కాల్పులు జరిపారని, డ్రైవర్ గాయపడ్డాడని వస్తున్న కథనాలలో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..


తూర్పుగోదావ‌రి జిల్లా గొల్ల‌ప్రోలు మండ‌లం చేబ్రోలు స‌మీపంలో హైవే పై ఓ లారీ వెళ్తోంది. ఆ లారీని కొందరు దుండ‌గులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డ్రైవర్ ఆపకపోవడంతో రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లారీ సైడ్ మిర్ర‌ర్ నుండి కొన్ని బుల్లెట్లు దూసుకెళ్లాయి. అద్దాలు ప‌గ‌లి దీప‌క్ అనే లారీ డ్రైవ‌ర్‌కు స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయని భావించిన స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో తెలిసిన సమాచారంతో మీడియాలో ఇదే విధంగా కథనాలు వచ్చాయి. దీనిపై పోలీసులు స్పందించారు. రివాల్వ‌ర్‌తో కాల్పులు జరిపారనేది నిజం కాదని, ఆ కథనాలలో వాస్తవం లేదని కొట్టిపారేశారు.


పోలీసులు ఏమన్నారంటే..
విశాఖ జిల్లా య‌ల‌మంచ‌లి నుండి - అమ‌లాపురానికి చిట్టినాడ్ సిమ్మెంట్ బ‌ల్క‌ర్‌ను లారీ డ్రైవర్ తీసుకెళ్తున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు సమీపంలో ఓ బైకుకు సైడ్ ఇవ్వలేదు. దీంతో తమకు ఓవర్ టేక్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆగ్రహించి లారీపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బైకర్ చేసిన రాళ్ల దాడిలో లారీ సైడ్ మిర్రర్ పగిలింది. లారీ డ్రైవర్‌కు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన నిందితులను గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. 


కొంత దూరం నుంచి తనను బైకుల మీద కొందరు ఫాలో అయ్యారని, మాస్కులు ధరించిన వాళ్లు ఎలా పడితే అలా వాహనం నడిపినట్లు లారీ డ్రైవర్ చెప్పాడు. అడిగిన వెంటనే రూట్ ఇవ్వలేని కారణంగా ఫైరింగ్ చేశాడని డ్రైవర్ తెలిపాడు. స్థానికులు మాత్రం తమ ప్రాంతంలో దుండగులు సంచరిస్తున్నారని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కాల్పులు జరిపారని లారీ డ్రైవర్ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.


Also Read: Breaking News: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వరుడు సహా 9 మంది దుర్మరణం


Also Read: Hyderabad: హాస్టల్‌లో నిద్రలేచిన విద్యార్థులకు భారీ షాక్! వెంటనే ప్రిన్సిపల్‌ వద్దకు పరుగులు