మహారాష్ట్ర(Maharastra) సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackery)తో సీఎం కేసీఆర్(CM Kcr) భేటీ ముగిసింది. అంతకు ముందు బేగంపేట్(Begampet) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన 'వర్ష'కు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సమావేశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కూడా పాల్గొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్... భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. పీపుల్స్ ఫ్రంట్ కు మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేస్తున్నారు.
ఈ సమావేశం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar)ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. సాయంత్రం 7.20 గంటలకు కేసీఆర్ ముంబయి(Mumbai) నుంచి హైదరాబాద్(Hyderabad) తిరిగి రానున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత(Mlc Kavita), పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ముంబయి టూర్
దిల్లీ కోట బద్దలు కొడతామని స్పష్టం చేసిన సీఎం ఆ దిశగా చకచకగా పావులు కదుపుతున్నారు. బీజేపీ(Bjp) ముక్త్ భారత్ అనే నినాదంతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పలువురు కీలక నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన(Mumbai Tour) ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై చర్చించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి నడుస్తామని ఇప్పటికే పలువురు నేతలు ముందుకు వచ్చారు.
గతంలో వీరితో భేటీలు
బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ కు సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారాఠ్, కేరళ సీఎం పినరాయి విజయన్ మద్దతు పలికారు. తర్వాత ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. ఆ సమయంలోనే ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి కేసీఆర్‌కు మద్దతు పలికారు. గతంలో కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోనూ భేటీ అయ్యారు. ఇటు కర్ణాటక నుంచి జేడీఎస్ నేత దేవె గౌడ, సీపీఐ అగ్రనేత డీ రాజా, పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీఎం కేసీఆర్‌కు ఫోన్‌చేసి మద్దతు పలికారు.
ముంబయిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు
ముంబయి నగరంలో ‘దేశ్ కా నేత కేసీఆర్’ అనే నినాదంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముంబయి పర్యటనకు ఒక్క రోజు ముందే ముంబయిలోని తెలంగాణ వారు, ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు ఈ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు అభిమాని అయిన తెలంగాణ సాయి వీటిని ఏర్పాటు చేయించారు. ఒకట్రెండు చోట్ల ఎల్ఈడీ లైట్లతో కూడిన ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఈ ఫ్లెక్సీల్లో మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు, కేటీఆర్ ఫోటోలతో పాటు ప్రాంతీయ పార్టీల నేతల చిత్రాలు ఉన్నాయి. మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి నేతల ఫోటోలను ఫ్లెక్సీపై ముద్రించారు.