Saina Nehwal Announces Separation With Parupalli Kashyap | మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కశ్యప్, తాను విడాకులు తీసుకుంటున్నామని సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. బ్యాడ్మింటన్ కోర్టులో వీరిద్దరి ప్రేమ కథ ప్రారంభమైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. అకాడమీలో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కింది. తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు సైనా, కశ్యప్ షాకిచ్చారు.

మా దారులు వేరయ్యాయి.. కశ్యప్‌తో విడాకులపై సైనా పోస్ట్

బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ షేర్ చేశారు. "జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దారుల్లో నడిపిస్తుంది. చాలా ఆలోచించిన తరువాత నేను, నా భర్త పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ఒకరికొకరు పరస్పరం మానసిక ప్రశాంతతతో పాటు ఎంతో అభివృద్ధి చెందాలని, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటివరకూ ఉన్న చిరస్మరణీయ క్షణాలకుగానూ కృతజ్ఞుతలు. మంచి భవిష్యత్తు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ’ సైనా పోస్ట్ చేశారు. ఈ కీలక సమయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని, మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని సైనా నెహ్వాల్ కోరారు. 

సైనా నెహ్వాల్ మరియు పారుపల్లి కశ్యప్ ల వివాహం ఎప్పుడు జరిగింది?

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు డిసెంబర్ 14, 2018 న ఘనంగా వివాహం చేసుకున్నారు. హర్యానాలోని హిసార్‌లో జన్మించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ కంటే 3 సంవత్సరాలు చిన్నది. పెళ్లి సమయంలో పారుపల్లి కశ్యప్ వయసు 31 సంవత్సరాలు, కాగా సైనా నెహ్వాల్‌కు 28 ఏళ్లు. పెళ్లి తరువాత సైనా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. ఆమె 2020లో బీజేపీ పార్టీలో చేరడం తెలిసిందే.

సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కెరీర్

సైనా నెహ్వాల్ 15 సంవత్సరాల వయస్సులో 2005లో ఆసియా టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆమె బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఇది ఒలింపిక్స్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన. సైనా నెహ్వాల్ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో 3 స్వర్ణ పతకాలు గెలుచుకోగా.. ఇందులో 2 మహిళల సింగిల్స్, ఒకటి మిక్స్‌డ్ డబుల్స్‌లో సాధించింది.

  • 2010, న్యూ ఢిల్లీ - మహిళల సింగిల్స్
  • 2018, గోల్డ్ కోస్ట్ - మహిళల సింగిల్స్
  • 2018, గోల్డ్ కోస్ట్ - మిక్స్‌డ్ డబుల్స్

2015లో, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే, అతను 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. పారుపల్లి కశ్యప్ 2013లో తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. కెరీర్ బెస్ట్ ఆరవ స్థానానికి చేరుకున్నాడు.