భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న(Rohan Bopanna)చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్(Australia Open 2024) పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌కు చేరడం ద్వారా43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌ చేరడం ద్వారా వచ్చే వారం నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకోవడం ఖాయమైంది. రోహన్‌ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాధ్యూ ఎబ్డెన్‌(Matthew Ebden) జోడి టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లో అర్జెంటీనా జోడీ గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెనీపై వరుస సెట్ల విజయం సాధించి బోపన్న జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో బోపన్న 43 ఏళ్ల వయస్సులో  ప్రపంచ నెంబర్ వన్‌గా నిలవనున్నాడు. 20 ఏళ్ల క్రితం  ప్రొఫెషనల్‌ టెన్నీస్‌లో అరంగేట్రం చేసిన ఈ భారత టెన్నీస్‌ స్టార్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకూ500కుపైగా విజయాలు సాధించాడు.  బోపన్న డబుల్స్‌ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. 

 

పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌గా నిలవడంపై భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న తొలిసారి స్పందించాడు. తన కెరీర్‌లో నమ్మశక్యం కానీ రెండు దశాబ్దాలు గడిచిపోయాయని రోహన్ బోపన్న అన్నాడు. ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఈ ఘనత సాధించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని ఈ టెన్నిస్‌ స్టార్‌ అన్నాడు. తన కుటుంబానికి, కోచ్, ఫిజియోకు, భారత టెన్నిస్‌ సమాఖ్యకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి బోపన్న ధన్యవాదులు తెలిపాడు. వారందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు. గత 13 నెలలు మెరుగ్గా రాణిస్తున్నామని అందుకే ఇది సాధ్యమైందని తెలిపాడు. ఈ ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌... భారతదేశానికి.. భారత టెన్నిస్‌కు అవసరమని వెల్లడించాడు. రెండు దశాబ్దాలుగా దేశం మొత్తం తనపై చాలా ప్రేమ చూపిందని... చాలా మద్దతుగా నిలిచిందని అన్నాడు. అందరి మద్దతుకు నేను కృతజ్ఞుడిగా ఉంటానని ఈ టెన్నిస్‌ స్టార్‌ తెలిపాడు.

 

తొలిసారి...

ఇప్పటివరకూ 17సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్న బోపన్న తొలిసారి సెమీఫైనల్‌ చేరి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వెస్లీ కూల్‌హోఫ్, నికోలా మెక్టిక్‌తో జరిగిన పోరులో విజయం సాధించిన బోపన్న-ఎబ్డెన్ జోడీ పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహిన్ బొపన్న ప్రతిభకు వయసుతో పనిలేదని చెప్పకనే చెబుతున్నాడు. 43 సంవత్సరాల లేటు వయసులోనూ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు.  ప్రస్తుత 2024 సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ మూడోరౌండ్ కు తనజోడీ మాథ్యూ ఈబ్డెన్ తో కలసి చేరుకొన్నాడు. తన సుదీర్ఘ టూర్ కెరియర్ లో 500వ విజయంతో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 

 

జోకో జోరు..

తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ రికార్డు స్థాయిలో 11వ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీఫైనల్‌కు చేరాడు. గతంలో సెమీస్‌కు చేరిన పదిసార్లు.. ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌.. ఈసారి కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసేందుకు తహతహలాడుతున్నాడు.