Man On Car Bonnet: బెంగళూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కారు ఓ వ్యక్తిని దాదాపు 400 మీటర్లు లాక్కెళ్లింది. జనవరి 15న మల్లేశ్వరంలోని మారమ్మ టెంపుల్ సర్కిల్ సమీపంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు.. జనవరి 15 రాత్రి 8:50 గంటల సమయంలో మారమ్మ టెంపుల్ సమీపంలో కారు, క్యాబ్‌ను ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు అశ్వత్, మునీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


ఈ క్రమంలో మునీర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తన కారు స్పీడ్ పెంచి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అశ్వత్‌ కారు బానెట్‌పైకి ఎక్కాడు. అయితే మునీర్ ఆపకుండా డ్రైవింగ్ చేశాడు. దాదాపు 400 మీటర్ల దూరం వరకు వెళ్లాడు. ఆ సన్నివేశాన్ని చూసిన స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మునీర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు కొట్టడంతో అశ్వత్‌ బానెట్‌పై నుంచి కిందపడ్డాడు. 






ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని వారు తెలిపారు. కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు తక్షణమే చర్య తీసుకున్నారు. అశ్వత్‌పై డాడి ఆరోపణలతో మునీర్‌పై నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్‌సీఆర్) నమోదు చేశారు.


ఇటీవలి కాలంలో ఇలాంటి బెంగళూరులో పెరిగిపోయాయి. ఈ మేరకు బెంగళూరు పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. రోడ్డు మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా 112కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు.


గత ఏడాది ఇలాంటి ఘటనే
గతేడాది జ్ఞాన భారతి నగర్‌లో  ఇదే తరహా ఘటన జరిగింది. ఓ మహిళ దర్శన్ అనే వ్యక్తిని తన కారు బానెట్‌పై నుంచి కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది. దీనిపై సదరు మహిళ భర్త ప్రమోద్ స్పందించారు. దర్శన్, నలుగురు స్నేహితులతో కలిసి తమను అసభ్యంగా దూషించాడని, తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని, చంపేస్తానని మరియు బెదిరించినట్లు ఆరోపించాడు.