పాకిస్తాన్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ నిస్సారమైన డ్రాగా ముగిసింది. చివరిరోజు ఆట ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (136 నాటౌట్: 242 బంతుల్లో, 15 ఫోర్లు, ఒక సిక్సర్), ఇమామ్ ఉల్ హక్ (111 నాటౌట్: 223 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీలు సాధించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ఇమామ్ ఉల్ హక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


449-7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసిపోవడానికి ఎంతో సేపు పట్టలేదు. కేవలం మూడు ఓవర్లలోనే ఆస్ట్రేలియా తన మూడు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (97: 159 బంతుల్లో, 15 ఫోర్లు), మార్నస్ లబుషగ్నే (90: 158 బంతుల్లో, 12 ఫోర్లు) తృటిలో సెంచరీలు మిస్సయ్యారు. డేవిడ్ వార్నర్ (68: 114 బంతుల్లో, 12 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (78: 196 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు.


పాకిస్తాన్ రోజంతా బ్యాటింగ్‌కు అవకాశం ఉండటంతో వేగంగా స్కోరు సాధించి ఆస్ట్రేలియా ముందు ఊరించే లక్ష్యం ఉంచుతారేమో అని అందరూ భావించారు. కానీ పాకిస్తాన్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చింది. దీనికి తగ్గట్లు పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ నిదానంగా ఆడారు.


పిచ్‌లో ఏమాత్రం జీవం లేకపోవడంతో రోజంతా ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ కోసం అల్లాడారు. వికెట్ కీపర్ అలెక్స్ కారే, ఓపెనర్ డేవిడ్ వార్నర్ తప్ప జట్టులో మిగతా తొమ్మిది మంది బౌలింగ్ చేయడం విశేషం. అయినా పాకిస్తాన్ బ్యాటర్ల వికెట్లు తీయలేకపోయారు.