Ravindra Jadeja 175 Notout: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దాని వెనక కారణాన్ని రవీంద్ర జడేజా బయటపెట్టాడు. ‘ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి డ్రెస్సింగ్ రూం నుంచి నాకు ముందుగానే మెసేజ్ వచ్చింది. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్‌పై బంతి తిరగడం మొదలైంది. దాంతోపాటు అదనపు బౌన్స్ కూడా లభిస్తుంది. వికెట్ తన ట్రిక్స్ ప్లే చేయడం ప్రారంభించిందని, శ్రీలంకను బ్యాటింగ్‌కు దించవచ్చని నేను సమాచారం పంపాను.’ అని ఆట అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజా తెలిపాడు.


‘వారు దాదాపు రెండు రోజుల నుంచి ఫీల్డ్‌లోనే ఉన్నారు. కాబట్టి అలసిపోవడం సహజమే. కాబట్టి వారు వెంటనే బ్యాటింగ్‌కు వచ్చి షాట్లు ఆడటం అసాధ్యం. కాబట్టి వీలైనంత త్వరగా స్కోరు సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేద్దాం అనుకున్నాం.’ అన్నాడు.


దీంతోపాటు ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 35 సంవత్సరాల నాటి కపిల్ దేవ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 1986 డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 163 పరుగులు సాధించాడు. భారత్ తరఫున ఏడో నంబర్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఈ స్కోరును జడేజా దాటేశాడు.


ఈ జాబితాలో మూడో స్థానంలో రిషబ్ పంత్ (159), నాలుగో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని (144) ఉన్నారు. 2019 సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఈ స్కోరును సాధించగా... 2011లో ఈడెన్‌గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు.