యంగ్ ఇండియాలో తన అద్భుతమైన స్పీచ్‌లతో స్ఫూర్తి నింపుతున్నాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన తర్వాత అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో యువ క్రికెటర్లను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో అసలు మ్యాచ్‌పై ఆశలు లేని స్థితి నుంచి దీపక్ చహర్ ఫైట్‌తో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ పోరాట స్ఫూర్తినే ద్రవిడ్ తన ప్రసంగంలో ప్రస్తావించాడు.
ఈ మ్యాచ్‌లో గెలవడం అద్భుతమని, ఒకవేళ ఓడిపోయినా తాను పెద్దగా పట్టించుకునే వాడిని కాదని ద్రవిడ్ అన్నాడు. మనం ప్రతిఘటిస్తామని వాళ్లకు తెలుసు. మనం ప్రత్యర్థిని కూడా గౌరవించాలి. వాళ్లు సవాలు విసిరారు. దానికి ఓ చాంపియన్ టీమ్‌లా మనం రెస్పాండ్ అయ్యాం. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని ద్రవిడ్ అన్నాడు. ఒకవేళ ఓడిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైట్ చేయడం అనేది ముఖ్యం. అది చేశారు బాగుంది అని యువ క్రికెటర్లపై ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.
లంకలో గబ్బర్‌సేన విజయానికి ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన కేరింతలు కొట్టడం విశేషం. ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో టీమ్‌ఇండియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన గబ్బర్ సేన లంకలో రెండు సిరీసులు ఆడుతోంది. కాగా మొదటి వన్డేను సునాయసంగా గెలిచిన భారత్, రెండో వన్డేలో కాస్త చెమటోడ్చింది. ఛేదనలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్‌తో పేసర్ దీపక్ చాహర్ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖర్లో లంక స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఫలితం ఏమవుతుందో అన్న ఆసక్తి కలిగింది. హసరంగ లెగ్‌స్పిన్‌ను ఎదుర్కొంటూనే, మిగతా వాళ్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదడంతో గబ్బర్‌సేన విజయం అందుకుంది. ఈ విజయాన్ని భారత అభిమానులే కాకుండా ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన సైతం ఆస్వాదించింది. ఆఖరి వరకు వారు మ్యాచును వీక్షించారు.