అసాధారణ పోరాటంతో శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన టీమిండియా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో కొన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కూడా గెలుచుకుంది. లంకపై టీమిండియాకు ఇది వరుసగా పదో విజయం కాగా వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం. అయితే వీటిని మించిన వరల్డ్ రికార్డ్ ఒకటి ఈ విజయంతో ఇండియా అందుకుంది. ఇది శ్రీలంకపై టీమిండియా సాధించిన 93వ విజయం.
ఈ గెలుపుతో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ వన్డే క్రికెట్‌లో ఏ టీమ్ కూడా ఏ ప్రత్యర్థిపైనా ఇన్ని విజయాలు సాధించలేదు. 2007 నుంచి భారత్-శ్రీలంక మధ్య జరిగిన సిరీస్‌లో టీమిండియాదే పై చేయి. భారత్ తర్వాత న్యూజిలాండ్‌పై 92 విజయాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. అలాగే శ్రీలంకపై 92 విజయాలతో పాకిస్థాన్ కూడా ఆస్ట్రేలియాతో పాటు సమానంగా ఉంది. శ్రీలంకతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పై కూడా భారత్‌కు మెరుగైన రికార్డే ఉంది. ఒక్కో జట్టుపై 55 విజయాలు నమోదు చేసింది.
ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే దీపక్ చహర్ చేసిన 69 పరుగులు ఇండియా తరఫున ఎనిమిదవ నంబర్ బ్యాట్స్‌మన్ చేసిన రెండో అత్యధిక పరుగులు కావడం విశేషం. అతని కంటే ముందు 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో రవీంద్ర జడేజా ఇదే స్థానంలో వచ్చి 77 పరుగులు చేశాడు. ఇక భువనేశ్వర్‌తో కలిసి దీపక్ చహర్ నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా తరఫున రెండో అత్యధిక పార్ట్‌నర్‌షిప్. 2017లో భువనేశ్వరే ధోనీతో కలిసి శ్రీలంకపైనే 8వ వికెట్‌కు 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు.
మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం(23న) జరగనుంది. కనీసం ఈ మ్యాచ్లో అయినా నెగ్గి పరువు కాపాడనుకుంటోంది శ్రీలంక. మరోపక్క టీమిండియా మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉబలాటపడుతోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేలకు టీమిండియా ఒకే జట్టుతో బరిలోకి దిగింది. చివరి వన్డేలో మార్పులు చేసి మరికొందరు యువకులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. వన్డే సిరీస్ తర్వాత భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ నెల 25, 27, 29 తేదీల్లో ఈ మూడు టీ20లు జరగనున్నాయి. మరి, వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న లంక టీ20 సిరీస్‌నైనా గెలుస్తుందో లేదో చూడాలి.