Rahul Chahar Marries Ishani Johar In Goa: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఓ ఇంటివాడయ్యాడు! ఫ్యాషన్ డిజైనర్, తన ఫియాన్సీ ఇషానీ జోహార్‌ను (Ishani Johar) పెళ్లి చేసుకున్నాడు. మార్చి 9న గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 12న రిసెప్షన్ ఉంటుందని సమాచారం. 2019లో ఇషానీతో రాహుల్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్పటి నుంచీ ఈ ప్రేమ పక్షులు కలిసి విహరిస్తున్నాయి!
తమ పెళ్లి వేడుక గురించి రాహుల్ చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'Our Happily ever after!!' అంటూ కామెంట్ పెట్టాడు. మెహందీ ఫంక్షన్, పెళ్లి వేడుక చిత్రాలను పంచుకున్నాడు.
ప్రస్తుత రాహుల్ చాహర్ వయసు 22 ఏళ్లు. టీమ్‌ఇండియా తరఫున ఈ యువ స్పిన్నర్ 6 టీ20 మ్యాచులాడి ఏడు వికెట్లు తీశాడు. 2021లో శ్రీలంకతో ఆడిన ఒక వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి ఆశ్చర్యపరిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో రాహుల్ చాహర్ మస్తు క్రేజ్ ఉంది. 2017లో అతడు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2018లో అతడిని ముంబయి ఇండియన్స్ రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచులు ఆడిన రాహుల్ చాహర్ 42 వికెట్లు తీశాడు. చివరి సీజన్లో 11 మ్యాచుల్లో 24.46 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.
తన బౌలింగ్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్లను రాహుల్ చాహర్ సులువగా బోల్తా కొట్టిస్తాడు. కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులను తిప్పుతూ పరుగులను నియంత్రిస్తాడు. ఆదమరిస్తే వికెట్ లాగేసుకుంటాడు. ఈ సీజన్లో అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతడిని రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.