Rahane Opens Up On Racism From Sydney Crowd Told Umpires We Won't Play Till They Take Action : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జాతి విద్వేష సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయని టీమ్‌ఇండియా క్రికెటర్లు అజింక్య రహానె (Ajinkya Rahane), రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) అన్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)ను కొందరు దూషించారని గుర్తు చేసుకున్నారు. జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిని స్టేడియం బయటకు పంపించాలని అంపైర్లను తాము గట్టిగా డిమాండ్‌ చేశామని వెల్లడించారు. 'బందో మే తా దమ్‌' (Bandon Mein Tha Dum) డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా వీరిద్దరూ మాట్లాడారు.


సిడ్నీ టెస్టు మూడో రోజు ముగిశాక భారత ఆటగాళ్లు మ్యాచ్‌ అధికారులతో మాట్లాడారు. తమను దూషించారని వివరించారు. తర్వాతి రోజు ఉదయమూ ఇలాగే కొనసాగడంతో ఆటగాళ్లు అంపైర్లను అప్రమత్తం చేశారు. దాంతో ఆటను పది నిమిషాలు నిలిపివేసి దూషించినవారిని బయటకు పంపించారు. ఆ సమయంలో ఆడటం ఇష్టం లేకపోతే డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోవచ్చని అంపైర్లు పాల్‌ రీఫిల్‌, పాల్‌ విల్సన్‌ సూచించారని రహానె చెప్పాడు. తాము ఆడాలని నిశ్చయించుకున్నామని, దూషకులను బయటకు పంపించాలని గట్టిగా చెప్పామని వెల్లడించాడు.


'సిరాజ్‌ నా వద్దకొచ్చి దూషణ గురించి చెప్పగానే నేను అంపైర్లతో మాట్లాడాను. కఠిన చర్యలు తీసుకొనేంత వరకు ఆడబోమని చెప్పాను. కావాలనుకుంటే ఆడటం మానేసి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాలని అంపైర్లు నాతో చెప్పారు. మేమిక్కడికి ఆడటానికి వచ్చామని రూమ్‌లో కూర్చోవడానికి కాదని గట్టిగా బదులిచ్చాను. దూషకులను బయటకు పంపించాలని స్పష్టం చేశాను. అలాంటి సమయంలో సహచరులకు అండగా నిలవడం మన బాధ్యత. సిడ్నీలో జరిగింది బాధాకరం' అని రహానె చెప్పాడు. సిడ్నీతో పోలిస్తే మెల్‌బోర్న్‌, అడిలైడ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం తక్కువేనని అతడు వివరించాడు. ఆ నగరంలో మాత్రం వరుసగా జరుగుతుంటాయని గుర్తు చేసుకున్నాడు.


క్రీడల్లో జాతి వివక్ష ఘోరమని రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఒక దేశంలోని ప్రత్యేకమైన ప్రజలు, వర్గాలపై ఇలా జరగకూడదని పేర్కొన్నాడు. చాలామంది తాము మెజారిటీలో భాగమని నమ్ముతుంటారని, జాతి వివక్ష దాని ఫలితమేనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వెల్లడించాడు. ఈ విషయాన్ని మహ్మద్‌ సిరాజ్‌ ధైర్యంగా ఎత్తి చూపించాడని ప్రశంసించాడు. దానివల్ల దూషకుల గురించి పక్క వారికి తెలుస్తుందని, మరోసారి అలా జరగకుండా అడ్డుకుంటారని వివరించాడు.