Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ దూరంగా ఉంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన సమయంలో తొడ కండరానికి గాయమైందని నాదల్‌ తెలిపాడు. ఈ గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేశాడు. గాయం వల్ల ప్రస్తుతం 5 సెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లతో పోటీ పడటానికి తాను సిద్ధంగా లేనని నాదల్‌ వెల్లడించాడు. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని  వైద్యుడి చెప్పినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ కోసం కోర్టులోకి దిగాలని గతేడాది చాలా శ్రమించానని.. కానీ కీలకమైన టోర్నీకి ముందు ఇలా జరగడం బాధగా ఉందని నాదల్‌ అన్నాడు. తన లక్ష్యం మాత్రం మరిచిపోనని... మరో మూడు నెలల్లో రాకెట్ పడతానని నాదల్‌ తెలిపాడు. మెల్‌బోర్న్ ప్రేక్షకుల ముందు ఆడలేకపోతుండటం బాధాకరంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు బరిలో ఉండే ఈ మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లైనా ఆడే వీలుంటే సంతోషించేవాడినని నాదల్‌ అన్నాడు. 

 

ఆ మ్యాచ్‌లోనే గాయం

 

బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోర్డాన్ థాంప్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఓటమి సమయంలో నాదల్ గాయంతో బాధపడ్డాడు. జనవరి 5న 3 గంటల 26 నిమిషాల వరకు సాగిన ఈ పోటీలో నాదల్ తీవ్రంగా పోరాడాడు. 

 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న నాదల్‌

 

కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్  ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు కీలక ప్రకటన చేశాడు. గాయాల కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు నాదల్ తెలిపాడు. ఎర్రమట్టి కోర్టుగా పిలిచే ఫ్రెంచ్ ఓపెన్ లో తన అరంగేట్రం (2005) నుంచి 2022 సీజన్ వరకూ నిరంతరాయంగా ఆడిన నాదల్.. 18 ఏండ్లలో ఏకంగా 14 ట్రోఫీలు గెలిచాడు. నాదల్ తన కెరీర్ లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్స్ నెగ్గితే అందులో అగ్రభాగం (14) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే కావడం గమనార్హం. అందుకే అతడిని మట్టికోర్టు మహారాజు అని పిలుస్తారు అభిమానులు.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి ఈ ఏడాది వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.

 

రోలండ్ గారోస్ నుంచి ఔట్..

 

ఫ్రెంచ్ ఓపెన్ లో ఫస్ట్ రౌండ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాదల్ ఈ ప్రకటన చేశాడు. గడిచిన నాలుగు నెలలుగా నేను గాయం నుంచి తిరిగి సాధారణ స్థాయికి వచ్చేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఇది చాలా కష్టంగా ఉంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో నేను ఎదుర్కున్న సమస్య (గాయం)కు ఇప్పటికీ పరిష్కారం కనుగొనలేకపోయాను. ప్రస్తుతం నేను టెన్నిస్ ఆడేందుకు ఉండాల్సిన ప్రమాణాలతో  లేను. రొలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్) ఆడే స్థితిలో కూడా లేను.. ప్రస్తుతానికైతే నేను కొన్నాళ్లు ఆటకు బ్రేక్ ఇద్దామనే అనుకుంటున్నా. నేను మళ్లీ ఎప్పుడు ప్రాక్టీస్ కు వస్తానో తెలియదు. అది రెండు నెలలు కావచ్చు. మూడు నెలలు కావచ్చు..’అని చెప్పాడు.