Rafael Nadal Announces Retirement From Professional Tennis: టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ వీడ్కోలు పలికాడు. మట్టికోర్టు రారాజుగా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన నాదల్... ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. టెన్నిస్ ఓపెన్ శకం మొదలైన తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కైవసం చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన నాదల్... ఇక ఆట చాలంటూ వీడ్కోలు పలికాడు. ఆటలో తనకు ఎదురులేదని.. మట్టి కోర్టులో తనను కొట్టే మొనగాడు లేడని.. ఫోర్ హ్యాండ్, టూ హ్యాండెడ్ ఫోర్‌షాట్లను తనలా కొట్టే ఆటగాడే లేడని నిరూపించిన నాదల్... ఆటకు గుడ్‌బై చెప్పేశాడు.
భావోద్వేగ ప్రకటన
టెన్నిస్ లెజెండ్, 22 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ టెన్నీస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. డేవిస్ కప్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతానని 38 ఏళ్ల నాదల్ ప్రకటించాడు. " గత కొన్నేళ్లుగా నేను చాలా కష్టకాలం ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా గత రెండేళ్లుగా నాకు చాలా క్లిష్ట సమయం. అందుకే కీలక నిర్ణయం మీతో పంచుకుంటున్నాను. డేవిస్ కప్ నా చివరి టోర్నమెంట్ అని చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను." అని నాదల్ తెలిపాడు.
కెరీర్ అంతా రికార్డుల మయం...
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 14 టైటిళ్లను సాధించాడు. 2022లో నాదల్ చివరిసారి రోలాండ్ గారోస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నాదల్ కెరీర్ ఇటీవల వరుస గాయాలతో గాడి తప్పింది. టెన్నిస్ చరిత్రలో అత్యంత పట్టుదలగల ఆటగాడిగా నాదల్‌కు పేరుంది. నాదల్ రెండు దశాబ్దాల కెరీర్‌లో 92 టైటిళ్లను సాధించాడు. 135 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సంపాదించాడు. 2005లో 19 ఏళ్ల వయసులో నాదల్ తొలి ఫ్రెంచ్ ఓపెన్ విజయం సాధించాడు. నాలుగు US ఓపెన్ టైటిళ్లు, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లను కూడా నాదల్ సాధించాడు, నాదల్ 2008లో ఒలింపిక్ బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు. 2005 నుంచి 2024 వరకు నమ్మశక్యం కాని రీతిలో 17 ఏళ్లపాటు ATP ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో కొనసాగాడు.
పడిలేచిన కెరటం
ఛాంపియన్ అంటే ఎలా ఉండాలి.. అచ్చం నాదల్‌లా ఉండాలి. ఎందుకంటే రఫేల్ నాదల్ పడి లేచిన కెరటం. ఎందుకంటే నాదల్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని మరీ ఉన్నతస్థానాన్నికి చేరాడు. 2009 వరకూ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కు అసలు ఓటమే లేదు. కానీ 2009లో నాదల్ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ ఏడాదే నాదల్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఓడిపోయాడు. కానీ నాదల్ అంతటితో ఆగిపోలేదు. కెరటంలా మళ్లీ లేచాడు. 2010లో 2010లో మళ్లీ ఫుంజుకున్న నాదల్ ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకుని తానెంటో క్రీడా ప్రపంచానికి చూపించాడు. ఎందుకు తనను ఛాంపియన్ అంటారో మరోసారి చాటిచెప్పాడు.
ఈ గణాంకాలు చాలవు
2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022... ఏంటి ఈ సంవత్సరాలు అనుకుంటున్నారా... స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న సంవత్సరాలు. అంతే కాదు... 2009, 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2008, 2010లో వింబుల్డన్... 2010, 2013, 2017, 2019లో యూఎస్ ఓపెన్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఈ గణాంకాలు చాలు టెన్నిస్ ప్రపంచాన్ని నాదల్ ఎంతలా ఏలాడు అని చెప్పడానికి.