T20 World cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే టీమ్‌ఇండియాకు ముగ్గురు పేసర్లు కీలకమని మాజీ బౌలింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ (R Sridhar) అంటున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండాలని నొక్కి చెప్పారు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాతో బౌలింగ్ విభాగానికి సమతూకం లభిస్తుందని వెల్లడించారు. ఎక్కువ మంది బౌలర్లు అందుబాటులో ఉండటంతో సెలక్షన్ కమిటీకి తలనొప్పి తప్పదని స్పష్టం చేశారు.
'టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు తలనొప్పే! నేనైతే నేరుగా ఒకే విషయం చెబుతున్నా. మిగతా వాటిని పట్టించుకోను. బుమ్రా (Jasprit bumrah), షమి (Mohammed Shami), భువీ (Bhuvaneshar Kumar) టీమ్‌ఇండియా టాప్-3 బౌలర్లు. వీరు ముగ్గురూ ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రస్తుతం భువీ అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. కొత్త బంతి, పాత బంతితో రాణిస్తున్నాడు. ఆరంభ, ఆఖరి ఓవర్లలో అదరగొడుతున్నాడు' అని శ్రీధర్ అన్నారు.
షమి తన బౌలింగ్‌తో ఓపెనింగ్ బ్యాటర్లకు ప్రశ్నలు సంధించగలడని శ్రీధర్ తెలిపారు. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో జట్టుకు ఐదో బౌలింగ్ ఆప్షన్ ఉంటుందని వెల్లడించారు.
Also Read: అథ్లెటిక్స్‌లో భారత్ అదరహో, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్‌కు రజతం - ట్విస్ట్ ఏంటంటే !
Also Read: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు - పతకం తెస్తారా?
'మనకు షమీ ఉన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లను అతడు కొత్త బంతితో ప్రశ్నించగలడు. భువీ, షమీతో రెండు సార్లు బౌలింగ్ చేయించొచ్చు. హార్దిక్, జడేజా వల్ల ఐదు, ఆరో బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రపంచకప్‌లో ఆడేటప్పుడు పెద్ద ఆటగాళ్లు ఉండాలి. ఫాస్ట్ బౌలింగ్‌కు సంబంధించి వీళ్లు ముగ్గురూ ప్రధానం. మరో బిగ్ బాయ్ హార్దిక్ ఉన్నాడు' అని ఆయన పేర్కొన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తర్వాత భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 23 వికెట్లు తీశాడు. బంతిని చక్కగా స్వింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ, ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లు అతడి బౌలింగ్‌కు నప్పుతాయి.