Pv Sindhu Congratulated Chandrababu Naidu:  ఏపి ఫలితాల్లో టిడిపి రికార్డు విజయం సాధించిన  నేపధ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrabau Naidu)కు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(Pv Sindhu) అభినందనలు తెలిపారు. బాబుతో పాటూ పవన్ కళ్యాణ్(Pavan Kalyan), పురందేశ్వరి(Daggubati Purandeswari) లను టాగ్ చేస్తూ తన సోషల్ మీడియా  ట్విట్టర్ అకౌంటు లో పోస్ట్ చేశారు ఎన్డిఏ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలిపారు. 


ఈ సందర్భంగా ఆమె 'మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్' అంటూ ట్వీట్ చేశారు.  పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, ఎన్డిఏ కూటమిలకు కూడా అభినందనలు తెలిపారు.






ఇండోనేషియా ఓపెన్‌ నుంచి సింధు  నిష్క్రమణ:


ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ ,  రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పీవీ సింధుకు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై  ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఏకంగా ప్రపంచ 26వ ర్యాంకర్ వెన్ చి చేతిలో  12వ ర్యాంకర్ సింధుకు ఇదే తొలి పరాజయం. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వెన్ చిని మట్టికరిపించిన సింధు బుధవారం ఓటమిపాలైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో  అద్భుతంగా  పుంజుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తడబడింది. అనవసరం తప్పిదాలతో మ్యాచ్‌ను కోల్పోయింది. 70 నిమిషాల పాటు సింధు-వెన్ చి ఫైట్ కొనసాగింది. పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సింధుకు ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే రెండు ఒలంపిక్ పతకాలని పొంది మూడో ఒలింపిక్ పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సింధుకు ఈ ఓటమి నుంచి కోలుకోవాలని, మళ్ళీ  మరింత ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాల్సి ఉంది. 


ఇండోనేషియా ఓపెన్ టోర్నీ లో మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి  ఆకర్షి కశ్యప్ కూడా మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. థాయ్‌లాండ్ షట్లర్ రచనోక్ చేతిలో 18-21, 6-21తో ఘోరపరాజయాన్ని చవిచూసింది. తొలి గేమ్‌లో గట్టి పోటీనిచ్చిన ఆకర్షి రెండో గేమ్‌లో ప్రత్యర్థికి దాసోహమైంది. అయితే  మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్ శుభారంభం చేసింది. అశ్వినీ పొన్నప్ప-తనీషా జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది.