PV Sindhu Crashes Out In First Round Of Indonesia Open: ఒలింపిక్స్‌ సమీపిస్తున్న వేళ భారత స్టార్‌ షట్లర్‌, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు( PV Sindhu)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇండోనేషియా  ఓపెన్‌(Indonesia Open) తొలి రౌండ్‌లోనే సింధు పరాజయం పాలైంది. ఇండోనేషియా ఓపెన్‌లో గతేడాది రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధుకు.. ఈ ఏడాది కూడా అలాంటి నిరాశజనక ఫలితాలే వచ్చాయి.   పారిస్ ఒలింపిక్స్‌( Paris Olympics)కు కేవలం 50 రోజుల ముందు సింధు.. తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో భారత అభిమానులకు కూడా షాక్‌ తగిలింది. ఇండోనేషియా ఓపెన్‌ తొలి రౌంజ్‌లో చైనీస్ తైపీకి చెందిన హ్సు వెన్ చి చేతిలో సింధు ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సింధుపై వెన్‌ చికి ఇదే తొలి విజయం కావడం విశేషం. 


మ్యాచ్‌ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో 15-21, 21-15, 14-21తో తైపీ ప్లేయర్‌ వెన్‌ చి గెలుపొందింది. సింధు తొలి గేమ్‌ ఓడిపోయిన తర్వాత రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుంది. నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో తైపీ ప్లేయర్‌ వెన్‌ అద్భుత ఆటతీరుతో సింధుకు చెక్‌ పెట్టింది. వెన్ రెండో రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన నాలుగో సీడ్ కరోలినా మారిన్‌తో తలపడనుంది. గంటా 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లలో ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సింధుకు ఈ ఓటమి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మూడో ఒలింపిక్ పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సింధుకు ఈ ఓటమి నుంచి కోలుకుని మళ్లీ పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాల్సి ఉంది.






సింధు పంజుకుంటుందా
మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు గత నెలలో జరిగిన మలేషియా మాస్టర్స్ 2024(Malaysia Masters 2024)లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్‌ పోరులో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో పరాజయం పాలైంది. ఇండోనేషియా ఓపెన్‌లోకు ముందు సింధుకు సింగపూర్ ఓపెన్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి కరోలినా మారిన్‌పై ఓటమితో 28 ఏళ్ల సింధు ప్రయాణం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే మరో షట్లర్, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ఇండోనేషియా ఓపెన్ 2024లో ఆరంభంలోనే నిష్క్రమించాడు. ప్రణయ్‌ 17-21, 12-21తో ప్రియాంషు రజావత్ చేతిలో వరుస గేమ్‌లలో ఓడిపోయాడు. మ‌హిళ‌ల డ‌బుల్స్‌లోనూ భార‌త జోడి క‌థ ముగిసింది. రుత‌ప‌ర్న, శ్వేత‌ప‌ర్న పండా జోడి కూడా పరాజయం పాలైంది. కొరియా  జంట 12-21, 9-21 భారీ తేడాతో మ‌ట్టిక‌రిపించింది. అయితే మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని ద్వయం 21-15, 21-15తో కెనడాకు చెందిన జాకి డెంట్‌-క్రిస్టల్‌ లాయ్‌ను ఓడించారు.