ఎనిమిదేళ్లకు బ్యాడ్మింటన్ శిక్షణ ప్రారంభించింది. ప్రాక్టీస్ కోసం ప్రతి రోజూ 56 కిలోమీటర్లు ప్రయాణించేది. అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్-14 కేటగిరీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలుపొందింది. ఇంతకీ ఈ క్రీడాకారిణి ఎవరో గుర్తుపట్టారా? మన తెలుగు తేజం పీవీ సింధు. అండర్-14 కేటగిరీలో చిన్న వయస్సులోనే స్వర్ణం సాధించిన సింధు... మరి, ఈ సారి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తుందా? 




Tokyo Olympicsలో గ్రూపు-Jలో చోటు దక్కించుకున్న సింధుకు ప్రారంభంలో సులువైన డ్రానే పడింది. తన కంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుక ఉన్న క్రీడాకారిణీలతో ఆమె తలపడనుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 7వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. హాంకాంగ్‌కి చెందిన 34వ ర్యాంక్ క్రీడాకారిణి చెంగ్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో 58వ ర్యాంకర్ ఇజ్రాయిల్ షట్లర్ పోలికపోవా‌ను సింధు ఢీకొట్టనుంది. 
ర్యాంకుల పరంగా చూస్తే ప్రారంభంలో సింధుకి సులువైన డ్రానే ఉందని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, పోటీ జరిగే సమయంలో ఎవరు ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తే వారిదే విజయం. కరోనా కారణంగా ప్రస్తుతం క్రీడాకారిణీలు ఎన్నా సన్నద్ధమవుతున్నారన్న దానిపై క్లారిటీ లేదు. ఎవరి టెక్నిక్ ఏంటో, ఎవరు ఎక్కడ వీక్‌గా ఉన్నారో తెలియడం లేదు. దీంతో ఎవర్ని తక్కువ అంచనా వేయలేం. 
ఇదే పాయింట్ పై పీవీ సింధు మాట్లాడుతూ...  ‘చెంగ్ చాలా బాగా ఆడుతోంది. కాబట్టి తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఫస్ట్ మ్యాచే కాదు ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యం. ప్రత్యర్థులను అంచనా వేయలేం. కరోనా పరిస్థితులు లేకుండా ఉంటే ప్రత్యర్థుల ఆటపై ఎంతోకొంత అవగాహన వచ్చేది. టోర్నీల్లో పాల్గొనడం, వారితో తలపడటం లాంటివి జరిగితేనే సహచర ఆటగాళ్ల ఆటతీరును ఊహించగలం. కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్, ప్రతి పాయింట్ ముఖ్యమే’ అని సింధు చెప్పింది. 
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది పీవీ సింధు. రియో ఒలింపిక్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది సింధు. ఈ సారి సింధుకి కలిసొచ్చే ఒక అంశం ఏంటంటే... టోక్యో ఒలింపిక్స్‌లో మారిన్ పాల్గొనకపోవడం. గత కొన్ని నెలలుగా పక్కా ప్రణాళికతో, ప్రత్యేకంగా శిక్షణ పొందుతోంది సింధు. క్వార్టర్ ఫైనల్లో సింధు... యమగూచితో, సెమీఫైనల్లో తైజు యింగ్‌లతో తలపడే అవకాశం ఉంది. వీరందర్నీ దాటుకుని సింధు ఒకవేళ ఫైనల్ చేరితే టాప్ సీట్ చెన్ యూఫీని ఢీకొట్టనుంది. మరి, సింధు వీరందర్నీ సమర్థంగా దాటుకుని స్వర్ణం సాధిస్తుందా?


ఫైనల్ ఫోబియా:


సింధుకి ఫైనల్ ఫోబియా ఉందంటూ ఆ మధ్య గట్టిగానే వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఏ టోర్నీకి వెళ్లినా ఫైనల్లో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకునేది. అందుకే అభిమానులు సింధుకి ఫైనల్ ఫోబియా అనేవారు. మరిప్పుడు సింధుకి ఫైనల్ ఫోబియా ఇంకా ఉందా అంటే... ‘నాకు ఎప్పుడూ, ఎలాంటి ఫోబియాలు లేవు. ఆటలో గెలుపోటములు సహజం’ అని అంటోంది సింధు.  అన్నింటినీ జయించి సింధు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని ఆకాంక్షిద్దాం.