APICET Exam: ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలివే..

Andhra Pradesh Integrated Common Entrance Test Exam Date: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్‌ (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలను సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ శశిభూషణ్ రావును (ఆంధ్రా యూనివర్సిటీ) ప్రభుత్వం నియమించింది. ఐసెట్‌తో పాటు పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను కూడా మంత్రి విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు ఆలస్యమైంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు ఖరారు అవుతున్నాయి. 
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్‌..
తెలంగాణలో ఐసెట్‌ (TS ICET) - 2021 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగించారు. తాజాగా వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఆలస్య రుసుముతో ఆగస్టు 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) తరఫున వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షలను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించనుంది. 
AP ECET పరీక్ష తేదీ ఖరారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- AP ECET) - 2021 పరీక్ష తేదీ ఖరారైంది. ఏపీ ఈసెట్ పరీక్షను సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈసెట్ పరీక్షను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిస్తుంది. ఈసెట్ పరీక్షలకు కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ను నియమించింది. కాగా, తెలంగాణలో ఈసెట్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈసెట్ పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తోంది. 
సెప్టెంబర్ 21న AP EDCET..
ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్‌సెట్ ) - 2021 పరీక్షను సెప్టెంబర్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరావును నియమించారు. కాగా, తెలంగాణలో ఎడ్‌సెట్ - 2021 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభం కాగా, కరోనా కారణంగా గడువును పలుమార్లు పొడిగించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

Continues below advertisement