ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ లాసెట్ (ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 పరీక్ష తేదీ ఖరారైంది. లాసెట్ పరీక్షను సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. లాసెట్ పరీక్ష తేదీతో పాటు పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఖరారు చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లాసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. లాసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ చంద్రకళను నియమించారు. లాసెట్ పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పరీక్షలను రద్దు చేసింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేస్తోంది. 
ఆగస్టు 23న తెలంగాణ లాసెట్..
తెలంగాణలో న్యాయ విద్య ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్ (TS LAWCET), టీఎస్ పీజీఎల్ సెట్ (TS PGLCET) పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవ్వగా.. దరఖాస్తు ప్రక్రియ ఆలస్య రుసుముతో ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2021 - 2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది మార్చి 24నే విడుదల అయినప్పటికీ, కరోనా కారణంగా దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటోంది. 
ఏపీ ఎంసెట్ పరీక్ష తేదీ ఖరారు..  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) పరీక్షలను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ జూన్ 26న ప్రారంభం అవ్వగా.. జూలై 25 వరకు కొనసాగనుంది. ఇక ఆలస్య రుసుముతో ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష పేరును ఏపీఈఏపీసెట్‌గా మార్చింది. 


AP PGECT పరీక్ష తేదీలు ఖరారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీ ఈసెట్ (Post Graduate Engineering Common Entrance Test) పరీక్షలను సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. పీజీ ఈసెట్ పరీక్షలను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పీజీ ఈసెట్ ప్రొపెసర్ ఆర్.సత్యనారాయణను నియమించింది.