బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి శుభవార్త. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌ సీఆర్‌పీ XI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత డిగ్రీ కలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్ https://www.ibps.in/ ను సంప్రదించవచ్చు. 




ఏయే బ్యాంకులకు?
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకుల్లోని  క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
విద్యార్హత, వయసు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా ఉండాలి. 2021 జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి. 
పరీక్ష విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇందులో నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమనరీ పరీక్ష ఇంగ్లిష్ (30 ప్రశ్నలు), న్యూమరికల్ ఎబులిటీ (35 ప్రశ్నలు), రీజనింగ్ ఎబులిటీ (35 ప్రశ్నలు) విభాగాలలో జరుగుతుంది. ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం 60 నిమిషాల పాటు పరీక్ష కొనసాగనుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్‌ పరీక్ష ఉంటుంది.  
మెయిన్ పరీక్షలో జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (40 ప్రశ్నలు), రీజనింగ్ ఎబులిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు) విభాగాలు ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షల్లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు.. 
ఆంధ్రప్రదేశ్
ప్రిలిమనరీ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, చీరాల, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు
తెలంగాణ
ప్రిలిమనరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 01, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.175, మిగతా వారు రూ.850 చెల్లించాలి. 
ప్రిలిమినరీ పరీక్షకు కాల్‌లెటర్ల డౌన్‌లోడ్: ఆగస్టు 2021
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4వ తేదీల్లో ఉంటుంది.
ప్రిలిమనరీ పరీక్ష ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2021
మెయిన్ ఎగ్జామ్ పరీక్షకు కాల్‌లెటర్ల డౌన్‌లోడ్: అక్టోబర్ 2021 
మెయిన్‌ పరీక్ష: అక్టోబర్‌ 31, 2021
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2022
వెబ్‌సైట్‌: https://www.ibps.in/