ఓవైపు కరోనాతో ముప్పుతిప్పలు పడుతున్న ప్రపంచాన్ని మరో పెను ముప్పు వెంటాడుతోంది. ఎవరూ ఊహించలేనంత శక్తిమంతమైన సోలార్ స్ట్రామ్.. భూమిపైకి దూసుకొస్తుంది. సమస్త శక్తికి, వెలుగుకి కారకుడైన సూర్యుడి వాతావరణంలో జరిగే ఈ మార్పు భూమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అయితే సూర్యుడిపై సౌర తుపానులు సాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇవేవీ ఇప్పటి వరకు భూమిపై ప్రభావాన్ని పెద్దగా చూపలేదు. కానీ తాజాగా ఏర్పడ్డ ఓ భారీ సౌర తుపాను భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల జీపీఎస్, సెల్ఫోన్ సిగ్నళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
స్పేస్వెదర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ప్రకారం.. సూర్యుడి వాతావరణంలో ఆవిర్భవించిన ఈ తుపాను వల్ల భూమిపై ప్రభావం పడనుంది. గంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ఇది భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుపాను అతి త్వరలో భూమిని తాకొచ్చని అంచనా.
ఏం జరగొచ్చు..?
ఈ సౌర తుపాను కారణంగా సమాచార వ్యవస్థపై ప్రభావం పడుతుందని స్పేస్వెదర్ వెబ్సైట్ పేర్కొంది. భూఉష్ణోగ్రత పెరుగుతుందని, తద్వారా శాటిలైట్లు ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయని తెలిపింది. ఫలితంగా జీపీఎస్ నేవిగేషన్, శాటిలైట్ టీవీలు, మొబైల్ సిగ్నళ్లకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
దీని వేగం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని, దీని కారణంగా భూమి వెలుపల వాతావరణంలో ఉన్న ఉపగ్రహాలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలా జరుగుతాయా?
ఈ భూ అయస్కాంత తుపాను శక్తిమంతమైన గాలులను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమికంగా సౌర తుపాన్లు భూ వాతావరణంలోకి ప్రవేశించే గాలుల శక్తిని సమర్థవంతంగా మార్పిడి చేయడం వల్ల భూమి అయస్కాంత గోళంలో సంభవించే పెద్ద లేదా చిన్న ఆటంకాలను సూచిస్తాయి.
2020 నవంబర్ 29న సూర్యుడి ఉపరితలంపై భారీ తుపాను సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దగా మంటలు ఎగసిపడి అంతరిక్షంలోకి సెగలు కక్కుతూ దూసుకెళ్లాయి. అంతటి అత్యంత వేడి, అతిపెద్ద సౌర తుపాను గత మూడేళ్లల్లో ఎప్పుడూ సూర్యుడిపై రాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిపై ఇలాంటి పేలుళ్లు సంభవించినప్పుడు అంతరిక్షంలోకి క్షణాల్లో సౌర గాలులు దూసుకెళ్తాయి. దీనినే కరోనల్ మాస్ ఇజెక్షన్ (coronal mass ejection) అంటారు.
మరోవైపు, సోలార్ తుపాను కారణంగా ధ్రువప్రాంతాల్లో ఉండేవారికి అద్భుత ఖగోళ దృశ్యాలు కనిపిస్తాయని స్పేస్వెదర్ తెలిపింది. రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి కనువిందు చేస్తుందని పేర్కొంది.