టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ బాబు అందరిలా హడావిడిగా సినిమాలు తీయరు. ఆయనకు కంటెంట్ నచ్చి.. పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందనుకుంటేనే సినిమాలు తీస్తారు. అలానే చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆయన నిర్మిస్తోన్న సినిమాలన్నీ కూడా ఓటీటీలోకే వస్తున్నాయి. వెంకటేష్ హీరోగా సురేష్ బాబు.. 'నారప్ప', 'దృశ్యం 2' లాంటి సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లోనే రిలీజ్ అవుతాయని ప్రేక్షకులు భావించారు. 


కానీ అనూహ్యంగా ఈ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే 'నారప్ప' సినిమాను అమెజాన్ ప్రైమ్ కి, 'దృశ్యం 2' సినిమాను హాట్ స్టార్ కి అమ్మేశారు. సదరు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇవ్వడంతో సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆయన బ్యానర్ లో తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలోనే విడుదలవుతుందని తెలుస్తోంది. 


రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను థియేటర్ లో వస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
హీరో రానా స్వయంగా నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు కూడా సినిమాకి మంచి డీల్ ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే సురేష్ బాబు నిర్మించిన మూడు క్రేజీ సినిమాలు ఓటీటీలోనే వస్తున్నాయన్నమాట. 


నిజానికి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి మీడియా ముందుకొచ్చి సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయమంటూ వేడుకున్నారు. ఆ సమయంలో 'నారప్ప' ఓటీటీ రిలీజ్ పై పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. అక్టోబర్ వరకు ఎదురుచూసి అప్పటికీ థియేటర్లు తెరుచుకోకపోతే అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసుకోమని అన్నారు. కానీ సురేష్ బాబు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. 
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కరెక్ట్ కాదనేది సురేష్ బాబు ఆలోచన. అందుకే తన సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. పైగా థర్డ్ వేవ్ ముప్పు కూడా ఉండడంతో ఇప్పట్లో సురేష్ బాబు తన సినిమాలను థియేటర్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది!