PV Sindhu New Coach: గతేడాది ఆగస్టులో బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి ఆ తర్వాత సుమారు  ఐదు నెలల పాటు విశ్రాంతి తీసుకుని   తిరిగి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన   తెలుగు తేజం పి.వి. సింధు  కొత్త కోచ్‌ను నియమించుకుంది.  మలేషియాకు చెందిన  మాజీ ఆటగాడు, 2003లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ గెలిచిన  మహ్మద్ హఫీజ్ బిన్ హషీమ్‌ ఆమెకు ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు  సింధు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 


కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన  సింధు..  ఆ తర్వాత  మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ ఏడాది ఆరంభంలో మలేషియన్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లలో ఆమె దారుణమైన  ఓటములను చవిచూసింది. ఈ ఆరు నెలల కాలంలో ఆమె ఒక్క  బీడబ్ల్యూఎఫ్ టోర్నీ కూడా నెగ్గలేదు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో   సింధు మాజీ కోచ్ పార్క్ టే సాంగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  టే సాంగ్  మార్గనిర్దేశకత్వంలో సింధు.. 2021లో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గింది. మూడేండ్ల పాటు టేసాంగ్.. ఆమెకు కోచ్‌గా వ్యవహరించాడు. 


 






ఎవరీ  హఫీజ్.. 


మలేషియాకు చెందిన మాజీ  ఆటగాడు హఫీజ్.. 2003 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. 2002 మాంచెస్టర్, 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాలు సాధించాడు. 2002, 2006 దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో  కాంస్య పతకాలు నెగ్గాడు. మలేషియా టీమ్ తరఫున థామస్ కప్, సుదిర్మన్ కప్‌లలో కూడా పతకాలు గెలుచుకున్నాడు. ఆట నుంచి రిటైర్ అయ్యాక హఫీజ్.. మలేషియాలోని   బ్యాడ్మింటన్ అకాడమీకి కోచ్‌గా పనిచేశాడు. 


గత నెలలో పివి సింధు.. హఫీజ్‌ను కోచ్‌గా నియమించుకునేందుకు   స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  (సాయ్) ను అనుమతి కోరగా  ఇటీవలే  దానికి అంగీకారం రావడంతో సింధు  ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. ప్రస్తుతం కొరియన్  ఓపెన్ ఆడుతున్న సింధుకు  కోచ్‌‌గా వ్యవహరిస్తున్న హఫీజ్.. ఆమెకు 2024 వరకూ కొనసాగుతాడు. 


లయను అందుకోవడమే అసలైన టాస్క్.. 


కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత విశ్రాంతి తీసుకుని జనవరి నుంచి మళ్లీ ఆడుతున్న సింధు మునపటి లయను కోల్పోయింది.  ఆమె ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది.   తాజాగా  బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంకు 17వ స్థానానికి పడిపోయింది.  పదేండ్ల తర్వాత సింధు టాప్ - 10  లో చోటు కోల్పోవడం ఇదే ప్రథమం. చివరిసారిగా సింధు.. 2013 జనవరిలో 17వ స్థానంలో నిలిచింది. మలేషియా, ఇండియా ఓపెన్‌తో పాటు  ఇటీవలే ముగిసిన  యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ ఫైనల్‌లో ఓడిపోవడం ఆమెను  చాలా కుంగదీసింది. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న సింధును తిరిగి మునపటి లయను అందుకునేలా చేయడమే  ప్రస్తుతానికి  హఫీజ్ ముందున్న అసలైన టాస్క్. దానికి ఎక్కువ సమయం కూడా లేదు. సెప్టెంబర్‌లో ఆసియా  క్రీడలు జరుగనున్న నేపథ్యంలో అప్పటివరకు సింధును పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం హఫీజ్ ముందున్న అసలైన టాస్క్.. 











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial