ICC ODI వరల్డ్ కప్ 2023, Pakitan Team: వన్డే వరల్డ్ కప్ 2023 ఈ సంవత్సరం భారతదేశంలో జరగనుంది. దీనికి ముందు చాలా పెద్ద వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఐసీసీ ప్రస్తుతం హైబ్రిడ్ ప్రపంచ కప్ ప్రణాళికపై చర్చిస్తోంది.


పాకిస్థాన్ జట్టు తన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లో ఆడవచ్చు. వాస్తవానికి ఈ విషయం ఐసీసీ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే దీనిపై అందరి నుంచి ఏకాభిప్రాయం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ లో పాక్ క్రికెటర్లకు వీసాలు ఇస్తామని భారత ప్రభుత్వం ఐసీసీకి ఇప్పటికే తెలిపింది.
      
వాస్తవానికి భారత్‌లో 2023 ప్రపంచ కప్ ఆడకుండా పాకిస్థాన్ మనదేశానికి సమాధానం చెప్పాలి అనుకుంటోంది. నిజానికి ఈ ఏడాది ఆసియా కప్ 2023 ఈవెంట్ కూడా జరగాల్సి ఉంది. కాగా దీనిని పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. 2023 ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించబోదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.


గత ఐదు నెలలుగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 వివాదం దాదాపుగా పరిష్కారమయ్యే దశలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాకిస్తాన్ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం కచ్చితమని తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, దాని మొత్తం మ్యాచ్‌లు వేరే దేశంలో ఆడుతుందని కూడా స్పష్టం చేశారు. ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్ కూడా ప్రపంచ కప్‌లో తన మ్యాచ్‌లు ఆడటానికి ఇదే రకమైన ప్రణాళికను రూపొందించింది. భారత్‌కు బదులు బంగ్లాదేశ్‌లో ఆడాలని భావిస్తుంది.


ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంటుందని.. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే అందుకోసం నిర్భయంగా ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు. 


2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేదు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ లు జరిగినప్పటికీ అందులో ఒక్క కప్ ను కూడా అందుకోలేకపోయింది. ఈ పదేళ్ల కాలంలో టీమిండియా ఎన్నోద్వైపాక్షిక సిరీస్ లను గెలుచుకుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడికి తలొగ్గి కీలక మ్యాచుల్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది చివర్లో భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఫేవరెట్ అని చాలామంది క్రికెట్ పండితులు, విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 


'భారత్ ఎప్పటికీ బలహీనజట్టుగా మారదు. ఇంత ప్రతిభ ఉన్న దేశం బలహీనంగా ఉండదు. భారత్ లో అందుబాటులో ఉన్న సగం మంది ఆటగాళ్లకు కూడా అవకాశం లభించడం లేదు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన వన్డే సిరీస్ లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. నేను కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఒక సలహా ఇస్తున్నాను. ప్రపంచకప్ వరకు ఈ జట్టునే కొనసాగించండి.' అని గంగూలీ అన్నారు. అలాగే భయం లేని క్రికెట్ ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు.