టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారిణికి రజత పతకం వరించింది. టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్‌ అయిన భవీనా బెన్ పటేల్.. చైనాకు చెందిన క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌ వన్‌ సీడ్‌ అయిన యింగ్‌ జావోతో కలిసి తలపడిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమి పాలయింది. దీంతో భవీనాబెన్ రజత పతకం కైవసం చేసుకుంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే.. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో భారత దేశానికి ఒక పతకం రావడం ఇదే మొదటిసారి.


భవీనా బెన్‌ పటేల్ గుజరాత్‌కి చెందిన క్రీడాకారిణి. పోలియో ఆమె చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. మొదట్లో ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడడాన్ని భవీనా అలవాటు చేసుకుంది. ఆ తర్వాత దాన్నే కెరీర్‌గా ఎంపిక చేసుకొని ఆ దిశగానే సాధన చేసింది. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకుంది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా భవీనా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మలిక్ రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే.


గుజరాత్‌లోని మెహసానాకు చెందిన భవీనా బెన్‌ పటేల్‌ అయిదేళ్ల కిందటే అంటే 2016 రియో పారాలింపిక్స్‌కు ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా భవీనా పట్టుదల వీడకుండా టోక్యోలో అడుగుపెట్టింది. ఇక్కడ తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఆమె ఆత్మవిశ్వాసం వీడలేదు. మధ్యతరగతి కుటుంబంలో భవీనా పోలియో కారణంగా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులందరూ గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది. 


భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌లో చేర్పించాడు. అక్కడే ఆమె టేబుల్ టెన్నిస్ కెరీర్‌కు నాంది పడింది. ఫిట్‌నెస్‌ కోసం సరదాగా ఆట ఆడడం మొదలు పెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.