పారాలింపిక్స్‌లో భారత్ ప్రస్థానం ఓటములతో ప్రారంభమైంది. పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పోటీలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుభాయి పటేల్ తొలి రౌండ్లలో తలపడ్డారు. వీరిద్దరూ తొలి రౌండ్లో ఓటమి పాలయ్యారు.
మహిళల క్లాస్-3 విభాగంలో పోటీపడ్డ సోనాల్‌బెన్ మొదటి మూడు గేముల్లో ఆధిక్యం ప్రదర్శించింది. కానీ, ఒక్కసారిగా సోనాల్ తన ఫామ్ కోల్పోయింది. దీంతో 11-9, 3-11, 17-15, 7-11, 4-11 తేడాతో చైనా క్రీడాకారిణి లీ క్వాన్ చేతిలో ఓటమి పాలైంది. లీ ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి. అంతేకాదు, ఆమె రియో పారాలింపిక్స్‌లో రజత పతక విజేత.
ఇక మహిళల క్లాస్-4 విభాగం తొలి పోరులో భావినా బెన్ సైతం చైనా అమ్మాయినే ఎదుర్కొవల్సి వచ్చింది. ఇక్కడ కూడా భారత్‌కి ఓటమి తప్పలేదు. ప్రపంచ నంబర్ వన్, జౌయింగ్ చేతిలో 3-11, 9-11, 2-11 తేడాతో ఓటమి పాలైంది.
అథ్లెట్ దీపా మలిక్... భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుభాయి పటేల్ ఆడే మ్యాచ్‌లకు ప్రత్యక్షంగా హాజరై వాళ్లను ప్రోత్సహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుభాయి పటేల్ తమ తమ విభాగాల్లో రేపు (గురువారం) రెండో రౌండ్లో తలపడనున్నారు. భావినా పటేల్ మ్యాచ్ ఉదయం 9.30గంటలకు ప్రారంభం అవుతుంది. సోనాల్ పటేల్ మ్యాచ్ సాయంత్రం 5.10గంటలకు స్టార్ట్ అవ్వనుంది.
భారత్ నుంచి విశ్వ క్రీడల్లో పాల్గొనే మిగతా పారా అథ్లెట్లు కూడా ఈ రోజు టోక్యో చేరుకున్నారు. సెప్టెంబరు 5 వరకు ఈ విశ్వ క్రీడలు జరగనున్నాయి. మరో పక్క ఆర్చర్లు తమ ఫస్ట్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నారు.