ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల్లో ఈడీ, సీబీఐ దర్యాప్తును సరిగా చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ తీరుపై అమికస్‌ క్యూరీగా ఉన్న విజయ్‌ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. మనీలాండరింగ్‌ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 58 కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశముందని విజయ్ హన్సారియా నివేదికలో పేర్కొన్నారు. అయితే 45 కేసుల్లో అసలు చార్జిషీట్లు కూడా వేయలేదని తెలిపారు. 


అమికస్ క్యూరీ సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దర్యాప్తు సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక కేసుల్లో ఇంకా చార్జిషీట్లు కూడా వేయలేదు. ఇలా ఎందుకు వేయలేదో కారణాలను కూడా దర్యాప్తు సంస్థలు చెప్పలేకపోయాయి. అయితే మనీలాండరింగ్ వంటి కేసుల్లో ఆస్తులు జప్తు చేస్తున్నామని చెప్పాయి. కానీ చార్జిషీట్లు వేయకుండా ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ఏం ప్రయోజనం సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  దర్యాప్తు సంస్థలపై అధిక భారం ఉందని అందుకే సంయమనం పాటిస్తున్నామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించారు.


అయితే సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాల వల్లే కేసుల విచారణ ఆలస్యం అవుతుందని చెప్పాలని ప్రయత్నించారు.  చాలా కేసుల్లో దర్యాప్తుపై హైకోర్టులు స్టే విధించాయని అందుకే ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే మొత్తం కేసుల్లో ఎనిమిదింటిలోనే స్టే ఉందని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌కు గుర్తు చేసింది.    పెండింగ్‌లో ఉన్న కేసులను అలాగే వదిలేయడం సరికాదని, కనీసం ఛార్జ్‌షీట్లయినా దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసుల విచారణలో మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉందని దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 


ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరిగతిన విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చాలా కాలంగా చెబుతోంది. కేంద్రం కూడా అందుకు అంగీకారం తెలిపింది. ఏడాదిలో విచారణ పూర్తి చేసేలా రోజువారీ విచారణలు చేయాలని నిర్ణయించింది. అయినప్పటికీ దర్యాప్తు సంస్థల తీరులో పెద్దగా చురుకుదనం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో న్యాయమూర్తులపై దాడులకు, బెదిరింపులకు పాల్పడిన కేసుల్లోనూ దర్యాప్తు సంస్థలు సహకరించడం లేదని .. అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల కేసుల్లోనూ దర్యాప్తు సంస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.