India Targets 2036 Olympic Glory: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా రంగంలో ఇండియా భవిష్యత్ లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే బలమైన సంకల్పంతో ఇండియా ఉందని స్పష్టం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ఇండియా ప్రాతినిధ్యం వహించని, క్వాలిఫై కాలేకపోయిన సరికొత్త క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
5 నుంచి 15 ఏళ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ఒలింపిక్స్ లో ఇండియా భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా భారీ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. "2036 ఒలింపిక్స్ నాటికి కనీసం ముప్పావు వంతు ఈవెంట్లలో ఇండియా పోటీపడేలా చేయాలని నిర్ణయించాం. ప్రతి గ్రామం, నగరం, స్కూల్ నుంచి 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నాం. ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి వరల్డ్ క్లాస్ అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ, ఆధునిక సదుపాయాలు అందిస్తాం" అని పేర్కొన్నారు.
క్వాలిఫై కాని ఈవెంట్లపై ఫోకస్.. 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలుఒలింపిక్స్ లో దాదాపు 40 విభాగాలు, 350 ఈవెంట్లు ఉన్నప్పటికీ, కనీసం మూడింట రెండు వంతుల క్రీడల్లో ఇండియా క్వాలిఫై కూడా కాలేకపోవడం విచారకరమని మోదీ గుర్తుచేశారు. "2036 ఒలింపిక్స్ లో భారత్ లో ఇప్పటివరకు పెద్దగా ఆడని, అంతగా ఆకట్టుకోని దాదాపు ముప్పావు వంతు క్రీడా విభాగాల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తాం. 2030 లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ (CWG) నిర్వహించబోతున్నాం. ఇండియా క్రీడా ప్రతిభ నిరంతరం పెరుగుతోంది, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో ఇండియా బలమైన పోటీదారుగా నిలుస్తుంది" అని వివరించారు.
టాప్స్ స్కీమ్ సక్సెస్.. భవిష్యత్ ఒలింపిక్స్ లక్ష్యాలుక్రీడాకారులకు మద్దతుగా 2014 లో ప్రారంభించిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని ప్రధాని ప్రశంసించారు. ఖేలో ఇండియా, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్ తో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, న్యూట్రిషన్ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ప్రపంచ స్థాయి టోర్నీలను భారత్‌కు తీసుకురావడమే కాకుండా, పతకాలు సాధించే దిశగా సరికొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని తెలిపారు.
